Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్‌ జోక్‌’తో మాట కలిపి! ఇప్పుడేమో ఇలా

5 Nov, 2022 11:19 IST|Sakshi
విరాట్‌ కోహ్లి- అనుష్క శర్మ

Virat Kohli- Anushka Sharma Love Story: క్రికెట్‌ రికార్డుల రారాజు అతడు.. ప్రతిభావంతురాలైన నటి ఆమె.. అప్పుడప్పుడు అతడూ ‘నటిస్తుంటాడు’.. అదే వారి చూపుల కలయికకు కారణమైంది.. పరిచయం స్నేహంగా.. ఆపై ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది.. అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా పండంటి పాపాయినీ ఇచ్చింది.. 

‘‘థాంక్‌ గాడ్‌.. నువ్వు ఈ భూమ్మీద పుట్టావు కాబట్టి సరిపోయింది.. లేదంటే నాకసలు ఏం తోచేదే కాదు.. నువ్వు లేకుంటే ఇక్కడి దాకా వచ్చేవాడినే కాదు.. నీ రూపమే కాదు.. మనసు కూడా ఎంతో అందమైనది’’ అంటూ ఆమెపై ప్రేమను కురిపిస్తాడు అతడు.. దేవుడు తనకిచ్చిన గొప్ప కానుకకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకొంటాడు..

ఆమె ఒక్కమాటలో.. ‘‘నువ్వే సర్వస్వం.. నీపై నా ప్రేమ అపరిమితం’’ అంటుంది. ఎల్లవేళలా అతడికి తోడుగా ఉంటుంది.. ఆమె అనుష్క శర్మ.. అతడు విరాట్‌ కోహ్లి.. వారి ప్రేమ కథే ఇది!

చూపులు కలిసిన శుభవేళ
కోహ్లి అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయం.. 2011 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న విరాట్‌ బ్రాండ్‌ వాల్యూ దృష్ట్యా తమ కమర్షియల్‌ యాడ్‌లో అతడిని నటింపజేసింది ఓ షాంపూ కంపెనీ. 2013 నాటి ఆ యాడ్‌లో కోహ్లికి జోడీగా అనుష్క శర్మ. 

స్వతహాగా నటి కాబట్టి చాలా క్యాజువల్‌గానే సెట్లోకి వచ్చిందామె. కానీ కోహ్లికి కొత్త కాబట్టి కాస్త కంగారుగా ఉన్నాడు. పొడవాటి హీల్స్‌ వేసుకుని తన కంటే ఎత్తుగా కన్పిస్తున్న అనుష్కను చూసి.. ‘‘ఇంతకంటే పొడుగైన హీల్స్‌ దొరకలేదా’’ అంటూ ఆమెతో మాట కలిపేందుకు ప్రయత్నించాడు. 

ఆమె కాస్త చిరాగ్గా ఏంటీ అని ఎదురు ప్రశ్నించడంతో.. ‘‘లేదు లేదు నేను జోక్‌ చేశానంతే’’ అంటూ తప్పించుకున్నాడు. కానీ ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడే ఆమె వ్యక్తిత్వానికి ఫిదా కాకుండా మాత్రం ఉండలేకపోయాడు. ఆ తర్వాత ఎలాగోలా మాటలు కలిశాయి.

అవును ప్రేమలో ఉన్నాం
అడపాదడపా బయట కలిసి కనిపించేవారు.. ఇటు క్రికెట్‌.. అటు సినిమా వర్గాల్లో చర్చ.. ఇంతకీ వీళ్లు నిజంగానే ప్రేమలో పడ్డారా? లేదంటే మూణ్నాళ్ల ముచ్చటగానే వీరి బంధం ముగుస్తుందా? అంటూ చెవులు కొరుక్కున్నారు. అనవసరంగా గాసిప్‌ రాయుళ్లకు మరీ ఎక్కువ పని కల్పించడం ఎందుకని విరాట్‌- కోహ్లి తమ గురించి తామే స్వయంగా బయట ప్రపంచానికి తెలిసేలా ఓ ప్రకటన చేశారు. 

‘‘ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. అందరు యువతీ యువకుల్లాగే మేమూ రిలేషన్‌షిప్‌లో ఉన్నాం’’ అని తమ బంధాన్ని బాహాటంగానే వెల్లడించారు. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా 2014 నవంబరులో ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూసేందుకు జంటగా హాజరయ్యారు.

ఫ్లైయింగ్‌ కిస్‌తో..
అదే ఏడాది శ్రీలంకతో మ్యాచ్‌ సందర్భంగా వన్డేల్లో అత్యంత వేగంగా 6 వేల పరుగుల మార్కును అందుకున్న బ్యాటర్‌ విరాట్‌ చరిత్ర సృష్టించాడు. కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌ వీక్షించేందుకు స్టేడియానికి వచ్చింది అనుష్క.. స్పెషల్‌ ఇన్నింగ్స్‌ తర్వాత బ్యాట్‌ను ముద్దాడి స్టాండ్స్‌లో ఉన్న నిచ్చెలికి ఫ్లైయింగ్‌ కిస్‌ విసిరాడు కోహ్లి. అతడి ప్రతిభకు మెచ్చుకోలుగా.. ప్రేమకు బదులుగా లేచి నిల్చుని చిరునవ్వులు చిందించింది అనుష్క.

కానీ కొంతమంది ఆకతాయిలు వారి ప్రేమను అపహాస్యం చేసే విధంగా.. అనుష్కను దారుణంగా నిందిస్తూ ట్రోల్‌ చేశారు. అయితే, కోహ్లి ఆమెకు అండగా నిలబడ్డాడు. తనలో సానుకూల దృక్పథం పెంపొందడానికి కారణం ఆమేనంటూ ప్రేమను చాటుకున్నాడు. 

ఎంగేజ్‌మెంట్‌.. పెళ్లి
2016లో తాము నిశ్చితార్థం చేసుకున్నట్లు వచ్చిన కథనాలను ఇద్దరూ ఖండించారు. దీంతో విరుష్క ఫ్యాన్స్‌లో గందరగోళం నెలకొంది. అయితే వారి అనుమానాలన్నీ పటాపంచలు చేశాడు కోహ్లి. 2017లో అనుష్కతో దిగిన సెల్ఫీని పోస్ట్‌ చేస్తూ నీతో ఉన్న ప్రతిరోజూ వాలైంటైన్‌ డేనే అంటూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించాడు. 

అదే ఏడాది డిసెంబరులో ఇటలీలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు ప్లాన్‌ చేసుకుందీ స్టార్‌ జంట. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి భార్యాభర్తలుగా తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు విరుష్క. వీరి ప్రేమకు గుర్తుగా 2021లో కుమార్తె వామిక జన్మించింది. 

కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా.. 
ఎన్‌హెచ్‌ 10 సినిమాతో నిర్మాతగా మారింది అనుష్క. ఆ సినిమాలో ఆమెదే లీడ్‌ రోల్‌. అనూహ్య పరిస్థితుల్లో అన్యాయంగా తన భర్తను, ఓ ప్రేమజంటను పొట్టనబెట్టుకున్న దుర్మార్గులకు శిక్ష విధించిన ఆధునిక స్త్రీగా ఆమె నటన అమోఘం. సినిమా చూసి మరోసారి ఫిదా అయ్యాడు కోహ్లి. నా అనుష్క నన్ను గర్వపడేలా చేసిందంటూ కితాబులిచ్చాడు. 

అనుష్క కూడా అంతే.. తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తూ ఎల్లప్పుడూ భర్త వెంటే ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. తన కెరీర్‌లో ఎత్తుపళ్లాలు.. ముఖ్యంగా గత మూడేళ్లలో నిలకడలేమి ఫామ్‌, కెప్టెన్సీ కోల్పోవడం వంటి పరిణామాల నేపథ్యంలో విమర్శల పాలైన కోహ్లికి ఆమె ధైర్యాన్నిచ్చింది. 

తిరిగి ఫామ్‌ పొందడం, ఆసియా కప్‌, ప్రపంచకప్‌ టోర్నీల్లో వరుసగా అద్భుత ఇన్నింగ్స్‌ నేపథ్యంలో ఒకానొక సందర్భంలో కోహ్లి.. తన సెంచరీని అనుష్కకు అంకితమిస్తూ.. తన జీవితంలో ఆమె పాత్ర, ప్రభావం ఏమిటో చెప్పకనే చెప్పాడు. ఇలా ఈ స్టార్‌ జంట ఎప్పటికప్పుడు కపుల్‌ గోల్స్‌ సెట్‌ చేస్తూ యువ జంటకు ఆదర్శంగా ఉంటోంది.
(నవంబరు 5 కోహ్లి పుట్టినరోజు సందర్భంగా)
- సుష్మారెడ్డి యాళ్ల

చదవండి: Virat Kohli Birthday Special: 'కింగ్‌' కోహ్లి.. కరగని శిఖరం
ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత..

మరిన్ని వార్తలు