అజహరుద్దీన్‌పై వేటు!

17 Jun, 2021 02:34 IST|Sakshi

అధ్యక్ష పదవినుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించిన  హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో అనూహ్య పరిణామం! నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ స్వయంగా అధ్యక్షుడిపైనే హెచ్‌సీఏ చర్య తీసుకుంది. అసోసియేషన్‌ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. ఆయన హెచ్‌సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అజహర్‌పై పలు ఆరోపణలు చేస్తూ ఈ నెల 10న అతనికి షోకాజ్‌ నోటీసు జారీ చేయగా...అందుకు అజహర్‌ స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు అపెక్స్‌ కౌన్సిల్‌ స్పష్టం చేసింది.

యూఏఈలో జరిగిన అనధికారిక టి10 టోర్నీలో ఒక జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడం, తన రిటైర్మెంట్‌ తేదీపై తప్పుడు సమాచారం ఇవ్వడం, హెచ్‌సీఏ ఖాతాలను స్థంభింపజేయడం, అంబుడ్స్‌మన్‌ ని యామకం, ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకోవడం, హెచ్‌సీఏ సమావేశాలకు హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఆరోపణలు చేసిన అపెక్స్‌ కౌన్సిల్‌...ఇకపై అసోసియేషన్‌ కార్యకలాపాల్లో అజహర్‌ పాల్గొనరాదని నిషేధం విధించింది. గత కొంత కాలంగా అజహర్‌కు, అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులకు మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవతలి పక్షంపై ఇరు వర్గాలు విరుచుకు పడుతున్నాయి. వివాదం బీసీసీఐ వరకు చేరినా, దీనిపై బోర్డు పెద్దగా స్పందించలేదు. ఇదే అపెక్స్‌ కౌన్సిల్‌ విభేదించినా సరే... ఇటీవల జరిగిన ఎస్‌జీఎంలో కూడా హెచ్‌సీఏ ప్రతినిధిగా అజహర్‌ పాల్గొనే అవకాశం బీసీసీఐ కల్పించింది. అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయానికి చట్టబద్ధత ఉందా లేదా అనే అంశంపై స్పష్టత లేని  నేపథ్యంలో అజహర్‌పై వేటు అంశం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు