అతని గేమ్‌ వేరే లెవెల్‌లో ఉంది: రోహిత్‌

9 Nov, 2020 22:16 IST|Sakshi

దుబాయ్‌: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టులో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మన సెలక్షన్‌ కమిటీలో ఒక్కొక్కరికీ ఒక్కో రూల్‌ అనేది సూర‍్యకుమార్‌ను పక్కకు పెట్టడంతో మరొకసారి రుజువైందని మాజీలు మండిపడ్డారు. దీనిపై ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పలువురు ఆటగాళ్లు ఆకట్టుకున్నారని, అందులో కొంతమందికి చాన్స్‌ వచ్చిందన్నాడు. అదే సమయంలో సూర్యకుమార్‌ సమయం కూడా వస్తుందని దాదా వెల్లడించాడు.

కాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌తో దుబాయ్‌ వేదికగా జరుగునున్న తుదిపోరులో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. రేపు(మంగళవారం) ముంబై-ఢిల్లీ జట్ల మధ్య టైటిల్‌ పోరు జరుగనుంది. ఇది ముంబైకు ఆరో ఫైనల్‌ కాగా, ఢిల్లీకి తొలి ఫైనల్‌.  దాంతో మరొకటైటిల్‌ను ఎగురేసుకుపోవాలని రోహిత్‌ గ్యాంగ్‌ ఒకవైపు,  తొలి టైటిల్‌ను ముద్దాడాలనే అయ్యర్‌ గ్యాంగ్‌ మరొకవైపు ఫైనల్‌ కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రిమ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ప్రత్యేకంగా సూర్యకుమార్‌ యాదవ్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘సూర్యకుమార్‌ యాదవ్‌ మంచి ఆరంభాలు ఇస్తున్నాడు. ఈ సీజన్‌లో ఒక ప్రత్యేకమైన సూర్యకుమార్‌ను చూస్తున్నాం. అతని గేమ్‌ వేరే లెవెల్‌లో ఉంది. అది మనమంతా చూశాం.. అందుకు మనమే సాక్షులం. ఒక చక్కటి టెంపోతో ఆడుతున్నాడు. దాన్నే కొనసాగిస్తూ విలువైన పరుగులు చేస్తున్నాడు. మా విజయాల్లో సూర్యకుమార్‌ భాగస్వామ్యం చాలా పెద్దది’ అని పేర్కొన్నాడు.

ఢిల్లీతో జరిగిన క్వాలిఫయర్‌-1లో సూర్యకుమార్‌ యాదవ్‌  హాఫ్‌ సెంచరీ సాధించి ముంబై భారీ స్కోరు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. అదే సమయంలో ఈ సీజన్‌లో 450 పరుగులకు పైగా సాధించిన ఎనిమిది మంది ఆటగాళ్లలో సూర్యకుమార్‌ ఒకడు. ఇక వంద ఐపీఎల్‌ మ్యాచ్‌లు, రెండు వేలకు పైగా పరుగులు చేసిన తొలి అన్‌క్యాప్డ్‌ భారత క్రికెటర్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ గుర్తింపు పొందాడు.

మరిన్ని వార్తలు