అతడిని జట్టు నుంచి తప్పించే పరిస్థితి.. కానీ కోహ్లి వల్లే ఇలా: దినేశ్‌ కార్తిక్‌

23 Feb, 2023 11:15 IST|Sakshi

Virat Kohli: ‘‘అచ్చం తన పెద్దన్నలాగే.. అతడికి కోహ్లి అండగా నిలబడ్డాడు. అందుకే అతడు తనని మార్గదర్శిగా భావిస్తాడనుకుంటా. క్లిష్ట పరిస్థితుల్లో విరాట్‌ కోహ్లి మద్దతుగా నిలిచాడు. కోహ్లి సారథ్యంలో అతడికి సరైన సమయంలో అవకాశాలు లభించాయి. అందుకే కోహ్లిని తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తాడు. నిజానికి తన కెరీర్‌లో అతడికి సహకరించిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు కోహ్లి. మరొకరు భరత్‌ అరుణ్‌.

బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న భరత్‌ అరుణ్‌ అతడికి ఎల్లప్పుడూ సరైన దారిలో పయనించేలా మార్గదర్శనం చేశాడు. తన కెరీర్‌లో అతడి పాత్ర కూడా కీలకం. కోచ్‌గా అరుణ్‌ తన బాధ్యతను నెరవేరిస్తే.. కెప్టెన్‌గా కోహ్లి అతడికి అండగా నిలిచి ఉన్నత స్థితికి చేరుకునేలా సహాయం అందించాడు.. టీమిండియా ప్రధాన పేసర్‌గా ఎదుగుతున్న మహ్మద్‌ సిరాజ్‌ గురించి మాట్లాడుతూ.. వెటరన్‌ బ్యాటర్‌, కామెంటేటర్‌ దినేశ్‌ కా​ర్తిక్‌ చేసిన వ్యాఖ్యలు ఇవి.

కోహ్లితో ప్రత్యేక అనుబంధం
హైదరాబాదీ సిరాజ్‌ ఎదుగుదలలో టీమిండియా స్టార్‌, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కీలక పాత్ర పోషించాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ జట్టుకు ఆడుతున్న సిరాజ్‌కు కోహ్లితో ప్రత్యేక అనుబంధం ఉంది. 

ఇక ఆదిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడి సత్తా చాటిన సిరాజ్‌ 2017లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విషయం విదితమే. కివీస్‌తో రెండో టీ20 ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.

ఆ మ్యాచ్‌లో దారుణంగా
అయితే, తన తొలి మ్యాచ్‌లోనే 4 ఓవర్ల కోటాలో ఏకంగా 53 పరుగులు సమర్పించుకుని కేవలం ఒకే వికెట్‌ తీసి తీవ్ర విమర్శల పాలయ్యాడు సిరాజ్‌. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 40 పరుగుల తేడాతో గెలుపొందడంతో అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లయింది. 

నాటి మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(65), వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని (49) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అయినప్పటికీ.. కివీస్‌ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమైన భారత బౌలర్లపై మండిపడ్డారు ఫ్యాన్స్‌.

దీంతో జట్టులో సిరాజ్‌  స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో.. 2020 ఐపీఎల్‌లో తన ప్రదర్శన కారణంగా ఆర్సీబీ జట్టులోనూ స్థానం కోల్పోయే ప్రమాదం ఏర్పడినపుడు కోహ్లి అతడికి అండగా నిలబడ్డ విషయాన్ని డీకే తాజాగా ప్రస్తావించాడు.

సత్తా చాటి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచి
క్రిక్‌బజ్‌.. ‘రైజ్‌ ఆఫ్‌ న్యూ ఇండియా’ షోలో మాట్లాడుతూ.. ‘‘నిజానికి ఆరోజు సిరాజ్‌ను జట్టు నుంచి తప్పించాల్సింది. కానీ విరాట్‌ కోహ్లి అతడికి అండగా నిలబడ్డాడు. తుదిజట్టులో అతడు ఉండాల్సిందేనని పట్టుబట్టాడు. 2020లో ఆర్సీబీతో మ్యాచ్‌.. నేను కేకేఆర్‌ జట్టులో ఉన్నాను. నాటి మ్యాచ్‌లో కేకేఆర్‌ 100లోపే ఆలౌట్‌ అయింది. సిరాజ్‌ మూడు వికెట్లతో సత్తా చాటాడు.


దినేశ్‌ కార్తిక్‌

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక అప్పటి నుంచి అతడి టీ20 కెరీర్‌ ఊపందుకుంది. నిజంగా సిరాజ్‌ ప్రయాణం స్ఫూర్తిదాయకం’’ అని దినేశ్‌ కార్తిక్‌ పేర్కొన్నాడు. కాగా నాటి మ్యాచ్‌లో కేకేఆర్‌ 84 పరుగులకే ఆలౌట్‌ కాగా.. ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తనపై కోహ్లి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న సిరాజ్‌ మూడు వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.  ఇక డీకే కూడా ప్రస్తుతం ఆర్బీసీకి ఆడుతున్న సంగతి తెలిసిందే.

చదవండి: Ind Vs Aus ODI Series: టీమిండియాతో వన్డే సిరీస్‌.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ల రీఎంట్రీ
T20 WC 2023: ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారా? టీమిండియా పటిష్ట జట్టు: ఆసీస్‌ కెప్టెన్‌

మరిన్ని వార్తలు