SA Vs WI: క్లాసెన్‌ విశ్వరూపం; 29 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేశారు

21 Mar, 2023 21:02 IST|Sakshi

మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో సౌతాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. విండీస్‌ విధించిన 261 పరుగుల టార్గెట్‌ను కేవలం 29.3 ఓవర్లలోనే ఉదేశారు. హెన్రిచ్‌ క్లాసెన్‌ (61 బంతుల్లో 119 పరుగులు నాటౌట్‌, 15 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడి సౌతాఫ్రికాకు ఘన విజయాన్ని కట్టబెట్టాడు. అతనికి తోడుగా మార్కో జాన్సెన్‌ 43, ఐడెన్‌ మార్క్రమ్‌ 25 పరుగులు చేశారు.

ఒక దశలో 87 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక మ్యాచ్‌ విండీస్‌ వైపు అనుకున్న తరుణంలో క్లాసెన్‌ తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. 12.1 ఓవర్లలో 87/4గా ఉన్న స్కోరు 29.3 ఓవర్లలో 264/6గా మారింది. అంటే కేవలం 17.1 ఓవర్లలో సౌతాఫ్రికా 177 పరుగులు చేసింది. దీన్నిబట్లే క్లాసెన్‌ విధ్వంసం ఏ మేరకు సాగిందో అర్థం చేసుకోవచ్చు.

క్లాసెన్‌ దాటికి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ ఓవర్‌కు 8.90 రన్‌రేట్‌తో ఇన్నింగ్స్‌ కొనసాగడం విశేషం. వన్డేల్లో భాగంగా చేజింగ్‌లో రన్‌రేట్‌ పరంగా సౌతాఫ్రికా ఇదే అత్యుత్తమం. ఇంతకముందు 2006లో ఆస్ట్రేలియాపై వాండరర్స్‌ వేదికగా జరిగిన వన్డేలో 435 పరుగుల లక్ష్యాన్ని 8.78 రన్‌రేట్‌తో 49.5 ఓవర్లలో చేధించడం ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉంది. తాజాగా ఆ రికార్డును సవరించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 48.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్‌ కింగ్‌ 72 పరుగులతో టాప్‌స్కోరర్‌ కాగా.. జాసన్‌ హోల్డర్‌ 36, నికోలస్‌ పూరన్‌ 39 పరుగులు చేశారు. ప్రొటీస్‌ బౌలర్లలో గెరాల్డ్‌ కోర్ట్జే, ఫోర్టున్‌, మార్కో జాన్సెన్‌లు తలా రెండు వికెట్లు తీశారు.

చదవండి: అన్నింటా విఫలం.. కెప్టెన్‌గా పనికిరాదా? 

మరిన్ని వార్తలు