ENG vs NZ: దురదృష్టమం‍టే నికోల్స్‌దే.. ఇలా కూడా ఔట్‌ అవ్వొచ్చా..!

24 Jun, 2022 07:55 IST|Sakshi

లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న అఖరి టెస్టులో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ హెన్రీ నికోల్స్‌ విచిత్రకర రీతిలో పెవిలియన్‌కు చేరాడు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 55 ఓవర్‌ వేసిన జాక్ లీచ్‌ బౌలింగ్‌లో నికోల్స్ నాన్‌ స్ట్రైకర్‌వైపు భారీ షాట్‌ ఆడాడు. అయితే బంతి నేరుగా నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న మిచెల్‌ బ్యాట్‌కు తగిలి.. మిడ్-ఆఫ్ ఫీల్డర్‌ అలెక్స్ లీస్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నికోల్స్‌ నిరాశగా మైదానాన్ని వీడాడు. అయితే  నికోల్స్‌ ఔట్‌కాగానే ఇంగ్లండ్‌ బౌలర్లు సంబురాలు జరుపుకోగా, బౌలర్‌ లీచ్‌ మాత్రం ఆశ్చర్యంగా అలా ఉండిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

స్పందించిన మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్
నికోల్స్‌ ఔటైన విధానంపై మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి చట్టం ఏం చెబుతుందో మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ట్విట్టర్‌లో వెల్లడించింది. "దురదృష్టకరమైన రీతిలో నికోల్స్‌ తన వికెట్‌ను కోల్పోయాడు. కానీ ఇది పూర్తిగా  చట్టాలకు లోబడి ఉంది. నియమం ​33.2.2.2 ప్రకారం బంతి.. వికెట్‌, అంపైర్‌, ఫీల్డర్, ఇతర బ్యాటర్‌ని తాకిన తర్వాత క్యాచ్ తీసుకుంటే అది ఔట్‌గా పరిగణించబడుతుంది" అని  మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ‍ట్విటర్‌లో పేర్కొంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ తొలిరోజు ఆట ముగిసేసమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. బ్రాడ్‌ (2/45), లీచ్‌ (2/75)ల దెబ్బకు 123 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన కివీస్‌ను డరైల్‌ మిచెల్‌ (78 బ్యాటింగ్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకున్నాడు.
చదవండి: IND vs LEI: రాణించిన శ్రీకర్‌ భరత్‌.. టీమిండియా స్కోర్‌: 246/8


 

మరిన్ని వార్తలు