NZ VS SL 1st ODI: నిప్పులు చెరిగిన షిప్లే.. వణికిపోయిన లంకేయులు

25 Mar, 2023 13:37 IST|Sakshi

ఆక్లాండ్‌ వేదికగా శ్రీలంకతో ఇవాళ (మార్చి 25) జరిగిన తొలి వన్డేలో ఆతిధ్య న్యూజిలాండ్‌ 198 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కివీస్‌ యువ పేసర్‌ హెన్రీ షిప్లే నిప్పులు చెరిగాడు. 7 ఓవర్లలో 31 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా 275 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక.. 19.5 ఓవర్లలో 76 పరుగులకే చాపచుట్టేసింది. షిప్లే ధాటికి లంక ఆటగాళ్లు వణికిపోయారు. ఇలా వచ్చి అలా పెవిలియన్‌ బాట పట్టాడు.

మెరుపు వేగంతో షిప్లే సంధించిన బుల్లెట్‌ లాంటి బంతులను ఎదుర్కొనేందుకు లంక ఆటగాళ్లు నానా తంటాలు పడ్డారు. షిప్లే నిస్సంకను క్లీన్‌బౌల్డ్‌ చేసిన తీరు మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. షిప్లేకు జతగా డారిల్‌ మిచెల్‌ (2/12), బ్లెయిర్‌ టిక్నర్‌ (2/20) కూడా రాణించడంతో 20 ఓవర్లలోపే లంకేయుల ఖేల్‌ ఖతమైంది. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో కివీస్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. 49.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. ఫిన్‌ అలెన్‌ (51) హాఫ్‌ సెంచరీతో రాణించగా.. డారిల్‌ మిచెల్‌ (47), గ్లెన్‌ ఫిలిప్స్‌ (39), రచిన్‌ రవీంద్ర (49) పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో చమిక కరుణరత్నే 4 వికెట్లు పడగొట్టగా.. రజిత, లహీరు కుమార  తలో 2 వికెట్లు, మధుశంక, షనక చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

ఈ మ్యాచ్‌ ద్వారా లభించే మొత్తాన్ని కివీస్‌ క్రికెటర్లు ఇటీవల విధ్వంసం సృష్టించిన గాబ్రియెల్‌ సైక్లోన్‌ బాధితులకు అందజేయనున్నారు. తుఫాను బాధితులకు సంఘీభావంగా ఆటగాళ్లు, స్టేడియంలోని ప్రేక్షకులు 14.2 ఓవర్‌ తర్వాత లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ సందర్భంగా కివీస్‌ ఆటగాడు బ్లెయిర్‌ టిక్నర్‌ కంటతడి పెట్టుకోవడం అందరిని కలచివేసింది.  

మరిన్ని వార్తలు