AUS VS NZ 1st ODI: క్యారీ, గ్రీన్‌ల అద్భుత పోరాటం​.. ఆసక్తికర పోరులో కివీస్‌పై ఆసీస్‌ విజయం

6 Sep, 2022 17:58 IST|Sakshi

3 వన్డేల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న న్యూజిలాండ్‌ కెయిన్స్‌ వేదికగా ఇవాళ (సెప్టెంబర్‌ 6) తొలి వన్డే ఆడింది. చివరి నిమిషం వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు అలెక్స్‌ క్యారీ (99 బంతుల్లో 85; 8 ఫోర్లు, సిక్స్‌), కెమరూన్‌ గ్రీన్‌ (92 బంతుల్లో 89 నాటౌట్‌; 10 ఫోర్లు, సిక్స్‌)లు అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. ముఖ్యంగా గ్రీన్‌ చివరి నిమిషం వరకు క్రీజ్‌లో ఉండి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా ఆసీస్‌ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ఆసీస్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. డెవాన్‌ కాన్వే (68 బంతుల్లో 46; 4 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ విలియమ్సన్‌ (71 బంతుల్లో 45; 3 ఫోర్లు, సిక్స్‌), వికెట్‌కీపర్‌ టామ్‌ లాథమ్‌ (57 బంతుల్లో 43; 2 ఫోర్లు, సిక్స్‌) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో మ్యాక్స్‌వెల్‌ 4, హేజిల్‌వుడ్‌ 3, స్టార్క్‌, జంపా తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం 233 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌.. 44 పరుగులకే సగం వికెట్లు  కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, అలెక్స్‌ క్యారీ, కెమరూన్‌ గ్రీన్‌ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఆసీస్‌ను గెలిపించారు.  గ్రీన్‌ తొమ్మిదో వికెట్‌కు ఆడమ్‌ జంపాతో (13 నాటౌట్‌) కలిసి 26 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో ట్రెంట్‌ బౌల్ట్‌ (4/40), మ్యాట్‌ హెన్రీ (2/50)లు ఆసీస్‌ను వణికించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా సెప్టెంబర్‌ 8న జరుగనుంది.  
చదవండి: రైనా రిటైర్మెంట్‌పై స్పందించిన చెన్నై యాజమాన్యం

మరిన్ని వార్తలు