Herschelle Gibbs:బీసీసీఐ నన్ను బెదిరిస్తోందంటూ మాజీ క్రికెటర్‌ ఆరోపణలు

31 Jul, 2021 12:03 IST|Sakshi

ఢిల్లీ: దక్షిణాఫ్రికా మాజీ స్టార్‌ క్రికెటర్‌ హర్షలే గిబ్స్‌ బీసీసీఐని తప్పుబడుతూ ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించాడు. పాకిస్తాన్‌లో జరగబోయే కశ్మీర్‌ ప్రీమియర్‌ లీగ్‌(కేపీఎల్ 2021‌)లో పాల్గొనడానికి వీలేదని.. ఒకవేళ ఆడితే మాత్రం భవిష్యత్తులో భారత్‌లో జరిగే క్రికెట్‌ టోర్నీలు సహా క్రీడా కార్యక్రమాలకు అనుమతించమని బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసిందంటూ తెలిపాడు.అయితే గిబ్స్‌ ఆరోపణలపై బీసీసీఐ స్పందించలేదు. విషయంలోకి వెళితే... వచ్చే నెల ఆగస్టు 6 నుంచి కేపీఎల్‌ 2021 సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో గిబ్స్‌ సహా లంక మాజీ ఆటగాడు తిలకరత్నే దిల్షాన్‌ సహా మరికొందరు క్రికెటర్లు కూడా ఆడనున్నారు. అయితే గిబ్స్‌ ట్విటర్‌ వేదికగా బీసీసీఐపై ఆరోపణలు చేశాడు.

''కశ్మీర్‌ ప్రీమియర్‌ లీగ్‌(కేపీఎల్‌)ను బీసీసీఐ రాజకీయ అంశంతో ముడిపెడుతుంది. నన్ను కేపీఎల్‌లో ఆడకుండా బీసీసీఐ అడ్డుపడుతుందని.. అంతేగాక ఒకవేళ లీగ్‌లో పాల్గొంటే భవిష్యత్తులో భారత్‌లో జరిగే ఎలాంటి క్రీడా కార్యక్రమాలకు అనుమతి ఇవ్వమని హెచ్చరికలు జారీ చేసింది. బీసీసీఐ అభ్యంతరం చెప్పడం నాకు నచ్చలేదు.. ఈ అంశం నన్ను చాలా బాధించింది'' అంటూ ట్వీట్‌ చేశాడు. ఇదే అంశంపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ రషీద్‌ లతీఫ్‌ కూడా బీసీసీఐని తప్పుబడుతూ ట్వీట్‌ చేశాడు. కాగా ఆగస్టు 6 నుంచి మొదలుకానున్న కేపీఎల్‌ టోర్నీలో ఓవర్సీస్‌ వారియర్స్‌, ముజఫర్‌బాద్‌ టైగర్స్‌, రావల్‌కోట్‌ హాక్స్‌, బాగ్‌ స్టాలియన్స్‌, మీర్పూర్‌ రాయల్స్‌, కోట్లీ లయన్స్‌ టీమ్‌లుగా ఉన్నాయి. ఇమాద్‌ వసీమ్‌, మహ్మద్‌ హఫీజ్‌, షాహిద్‌ అఫ్రిది, షాబాద్‌ ఖాన్‌, షోయబ్‌ మాలిక్‌, కమ్రాన్‌ అక్మల్‌లు ఈ ఆరు జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. 

మరిన్ని వార్తలు