ILT20 2023: తిరిగిస్తాడనుకుంటే పారిపోయాడు

31 Jan, 2023 08:17 IST|Sakshi

అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టి20 క్రికెట్‌లో హాస్యాస్పద సన్నివేశం చోటుచేసుకుంది. బ్యాటర్‌ కొట్టిన బంతి స్టేడియం అవతల పడింది. అయితే స్డేడియం బయట ఉన్న వ్యక్తి దానిని క్యాచ్‌గా తీసుకున్నాడు. ఆ తర్వాత బంతిని తీసుకొని అక్కడినుంచి పారిపోయాడు.  చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేకపోయినప్పటికి సదరు వ్యక్తి చర్య నవ్వులు పూయించింది. 

ఎంఎఐ ఎమిరేట్స్‌, డెసర్ట్‌ వైపర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది జరిగింది. ఎమిరేట్స్‌ బ్యాటింగ్‌ సమయంలో మౌస్లే డీప్‌స్క్వేర్‌ లెగ్‌ దిశగా బంతిని స్టాండ్స్‌ బయటికి పంపించాడు. బంతి వెళ్లి నేరుగా రోడ్డుపై పడింది. ఆ తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని తీసుకున్నాడు. స్టేడియంలోకి తిరిగి విసురుతాడనుకుంటే.. బంతితో అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ తర్వాత కాసేపటికే కీరన్‌ పొలార్డ్‌ భారీ సిక్సర్‌ కొట్టాడు. ఈసారి కూడా బంతి స్టేడియం అవతల పడింది. ఆ వ్యక్తి మళ్లీ కనిపిస్తాడేమో అని చూస్తే బంతిని తీసుకోవడానికి ఎవరు రాలేదు. దీనికి సంబంధించిన వీడియోను ఐఎల్‌టి20 తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. సిక్సర్ల వర్షం కురుస్తోంది.. మీరు ఏ టైప్‌ క్రికెట్‌ లవర్స్‌.. 1). తీసుకొని పారిపోవడం..2). తీసుకొని తిరిగిచ్చేయడం .. మీరే ఎంపిక చేసుకొండి అంటూ కామెంట్‌ చేసింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఎంఐ ఎమిరేట్స్‌ 157 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ ఎమిరేట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోరు చేసింది. మహ్మద్‌ వసీమ్‌ 86, ఆండ్రీ ఫ్లెచర్‌ 50, కీరన్‌ పొలార్డ్‌ 50, మౌస్లే 31 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన డెసర్ట్‌ వైపర్స్‌ 84 పరుగులకే కుప్పకూలింది. ఎమిరేట్స్‌ బౌలింగ్‌లో ఫజల్లా ఫరుఖీ మూడు వికెట్లు తీయగా.. జహూర్‌ ఖాన్‌, ఇమ్రాన్‌ తాహిర్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.

చదవండి: కాఫీ బ్యాగులతో ఆసీస్‌ క్రికెటర్‌; తాగడానికా.. అమ్మడానికా?

రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా స్టార్‌ ఓపెనర్‌

>
మరిన్ని వార్తలు