కేదార్‌ జాదవ్‌ని పెట్టుకొని ఏం చేస్తారు!

19 Feb, 2021 16:13 IST|Sakshi

చెన్నై: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వేలంలో మరోసారి పొదుపు మంత్రాన్ని పాటించింది. గురువారం జరిగిన మినీ వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ తమ పర్స్‌లో ఉన్న రూ. 10.75 కోట్లలో కేవలం రూ.3.80 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వారిలో సీఎస్‌కే వద్దనుకొని వదిలేసిన కేదార్‌ జాదవ్‌కు రూ.2 కోట్లు, బౌలర్‌ ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌కు రూ.1.5 కోట్లు, జగదీశా సుచిత్‌కు రూ. 30లక్షలు వెచ్చించింది.

అయితే వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ వ్యవహరించిన తీరుపై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. ముఖ్యంగా కేదార్‌ జాదవ్‌ విషయంలో సన్‌రైజర్స్‌ అభిమానులు పెట్టిన మీమ్స్ వైరల్‌ అయ్యాయి.'ఫామ్‌లో లేని ఆటగాడిని తీసుకొని ఏం చేస్తుంది.. అసలు సన్‌రైజర్స్‌ వ్యూహం ఏంటో ఎవరికి అంతుపట్టదు.. సీఎస్‌కే వద్దనుకుంది.. సన్‌రైజర్స్‌ కావాలనుకుంటుంది.' అంటూ కామెంట్స్‌ చేశారు.

కాగా కేదార్‌ జాదవ్‌ గత సీజన్‌లో సీఎస్‌కే తరపున 8 మ్యాచ్‌లాడి 62 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. అందుకే కేదార్‌ జాదవ్‌ మొదటిసారి వేలంలోకి వచ్చినప్పుడు కనీసం అతన్ని పరిగణలోకి కూడా తీసుకోలేదు. కానీ రెండోసారి వేలంలోకి వచ్చిన జాదవ్‌ను అనూహ్యంగా సన్‌రైజర్స్‌ రూ. 2కోట్ల కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. స్వదేశీ ఆటగాళ్లను తీసుకోవాలని భావించినప్పుడు ఫామ్‌లో ఉన్నకృష్ణప్ప గౌతమ్‌, కెఎస్‌ భరత్‌ లాంటి ఆటగాళ్లవైపు ఎస్‌ఆర్‌హెచ్‌ చూస్తే బాగుండేది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా 2016లో వార్నర్‌ సారథ్యంలో టైటిల్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ 2018లో విలియమ్‌సన్‌ కెప్టెన్సీలో చివరి మెట్టుపై బోల్తా కొట్టింది. ఇక గత సీజన్‌లో వార్నర్‌ నాయకత్వంలో ప్లేఆఫ్‌కు చేరుకున్నా క్వాలిఫయర్‌ 2లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
చదవండి: 'ఆర్యన్‌.. మీ నాన్నను కొనుగోలు చేశాం'

మరిన్ని వార్తలు