ఆ బెయిల్‌ ఎలా కిందపడింది : ఇషాంత్‌

10 Feb, 2021 13:16 IST|Sakshi

చెన్నై: భారత్, ఇంగ్లండ్ మధ్య మంగళవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అప్పటికే టీమిండియా ఓటమి ఖాయమైన నేపథ్యంలో ఆ సన్నివేశం నవ్వులు పూయించింది. అసలు విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 57వ ఓవర్లో ఇషాంత్‌ శర్మ క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్‌ ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్ షార్ట్ పిచ్ బంతిని సంధించగా.. దానిని హిట్ చేసేందుకు ఇషాంత్ ప్రయత్నించాడు.

అయితే అదనపు బౌన్స్ కారణంగా బంతి అతని బ్యాట్‌ను తాకకుండా శరీరాన్ని తాకి వికెట్లకి అతి సమీపంలో పడింది. అప్పటికే ఆఫ్ స్టంప్‌పై ఉన్న బెయిల్ కింద పడడంతో స్టంప్‌కి ఇషాంత్ పాదం తాకినట్లు భావించిన ఇంగ్లండ్‌ ఆటగాళ్లు హిట్ వికెట్‌ కోసం అప్పీల్ చేశారు. మరోవైపు ఇషాంత్ తన పాదం తాకుకుండానే బెయిల్ ఎలా కింద పడిందో అర్థం కాక ఆశ్చర్యానికి లోనయ్యాడు. అయితే ఈ విషయంపై క్లారిటీ లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్ తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌‌‌ని ఆశ్రయించాడు.

దాంతో.. రిప్లేని పరిశీలించిన థర్డ్ అంపైర్ దానిని డెడ్‌బాల్‌గా ప్రకటించాడు. బౌలర్ జోప్రా ఆర్చర్ బంతిని రిలీజ్ చేయకముందే ఆఫ్ స్టంప్‌పై నుంచి బెయిల్ దానంతట అదే కింద పడడం రిప్లేలో స్పష్టంగా కనిపించింది. అయితే షార్ట్ లెగ్‌లో ఉన్న రోరీ బర్న్స్‌ బెయిల్ కింద పడడం చూసి కూడా హిట్‌ వికెట్ కోసం అప్పీల్ చేయడం ఇక్కడ విశేషం.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత మరో 8 బంతులు మాత్రమే ఆడిన టీమిండియా బుమ్రా రూపంలో చివరి వికెట్‌ను కోల్పోయి 227 పరుగులు తేడాతో పరాజయం చవిచూసింది. కాగా ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 13 నుంచి చెన్నై వేదికగానే జరగనుంది.
చదవండి: ఐసీసీపై విరాట్‌ కోహ్లి ఆగ్రహం
'ఇప్పటికైనా అతనికి అవకాశం ఇవ్వండి'

మరిన్ని వార్తలు