Hockey Junior Asia Cup 2023: సెమీస్‌లో భారత్‌.. థాయ్‌లాండ్‌పై 17–0తో ఘన విజయం  

29 May, 2023 09:57 IST|Sakshi

సలాలా (ఒమన్‌): ఆసియా కప్‌ జూనియర్‌ పురుషుల హాకీ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. థాయ్‌లాండ్‌ జట్టుతో ఆదివారం జరిగిన పూల్‌ ‘ఎ’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 17–0 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున అంగద్‌బీర్‌ సింగ్‌ (13వ, 33వ, 47వ ని.లో) మూడు గోల్స్‌ చేయగా... అమన్‌దీప్‌ లాక్రా (26వ, 29వ ని.లో), ఉత్తమ్‌ సింగ్‌ (24వ, 31వ ని.లో) రెండు గోల్స్‌ చొప్పున సాధించారు.

శ్రద్ధానంద్‌ తివారి (46వ ని.లో), యోగంబర్‌ రావత్‌ (17వ ని.లో), అమన్‌దీప్‌ (47వ ని.లో), రోహిత్‌ (49వ ని.లో), అరైజీత్‌ సింగ్‌ హుండల్‌ (36వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. ఐదు జట్లున్న పూల్‌ ‘ఎ’లో భారత్‌ మూడు విజయాలు, ఒక ‘డ్రా’తో 10 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. పూల్‌ ‘ఎ’లో నేడు జపాన్, పాకిస్తాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌ విజేతకు మరో సెమీఫైనల్‌ బెర్త్‌ దక్కుతుంది. మ్యాచ్‌ ‘డ్రా’ అయితే పాకిస్తాన్‌ ముందంజ వేస్తుంది.    

మరిన్ని వార్తలు