Hockey Mens Junior World Cup 2021: తొలి పోరులో ఫ్రాన్స్‌ చేతిలో భారత్‌ పరాజయం..

25 Nov, 2021 08:02 IST|Sakshi

తొలి పోరులో ఫ్రాన్స్‌ చేతిలో భారత్‌ పరాజయం

సంజయ్‌ హ్యాట్రిక్‌ వృథా

జూనియర్‌ హాకీ ప్రపంచ కప్‌ 

భువనేశ్వర్‌: ప్రతిష్టాత్మక జూనియర్‌ హాకీ ప్రపంచ కప్‌ మొదటి పోరులో భారత్‌ తడబడింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాతో టోర్నీలో అడుగుపెట్టిన భారత జూనియర్‌ జట్టు... ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. బుధవారం గ్రూప్‌ ‘బి’లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4–5 గోల్స్‌ తేడాతో ఫ్రాన్స్‌ చేతిలో ఓడింది. భారత్‌ తరఫున సంజయ్‌ మూడు గోల్స్‌ (15, 57, 58వ నిమిషాల్లో) చేయగా... ఉత్తమ్‌ సింగ్‌ ఒక గోల్‌ (10వ నిమిషంలో) సాధించాడు. ఫ్రాన్స్‌ ప్లేయర్‌ క్లెమెంట్‌ టిమోతీ మూడు గోల్స్‌ (1, 23, 32వ నిమిషాల్లో), బెంజమిన్‌ (7వ నిమిషంలో), కొరెంటిన్‌ (48వ నిమిషంలో) చెరో గోల్‌ చేశారు.

రెండు నిమిషాల్లో రెండు గోల్స్‌ చేసినా... 
మ్యాచ్‌ తొలి నిమిషంలోనే భారత రక్షణ శ్రేణిని ఛేదించిన ఫ్రాన్స్‌ ఆటగాడు టిమోతీ ఫీల్డ్‌ గోల్‌ సాధించాడు. మరో ఆరు నిమిషాల తర్వాత బెంజమిన్‌ మరో ఫీల్డ్‌ గోల్‌ చేసి ఫ్రాన్స్‌కు 2–0 ఆధిక్యాన్నిచ్చాడు. ఫ్రాన్స్‌ అటాకింగ్‌ నుంచి తేరుకున్న భారత్‌ వెంట వెంటనే రెండు గోల్స్‌ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. ఆ వెంటనే ఫ్రాన్స్‌ మరో మూడు గోల్స్‌ చేసి తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఆట ఆఖరి నిమిషాల్లో వేగం పెంచిన భారత్‌ గోల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించింది.

ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌పై పదే పదే దాడులు చేసింది. ఈ క్రమంలో భారత్‌ రెండు నిమిషాల్లో రెండు గోల్స్‌ చేసి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించేలా కనిపించింది. 57, 58వ నిమిషాల్లో లభించిన రెండు పెనాల్టీ కార్నర్‌లను ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా గోల్స్‌గా మలిచిన సంజయ్‌ ఫ్రాన్స్‌ ఆధిక్యాన్ని 5–4కు తగ్గించాడు. అనంతరం మరో గోల్‌ సాధించడంలో విఫలమైన భారత్‌ ఓటమిని ఆహ్వానించింది. మ్యాచ్‌లో భారత్‌కు మొత్తం ఏడు పెనాల్టీ కార్నర్స్‌ లభించగా వాటిలో మూడింటిని మాత్ర మే గోల్స్‌గా మలిచి మూల్యం చెల్లించుకుంది. 

చదవండి: WI Vs SL: పరాజయం దిశగా విండీస్‌... విజయానికి నాలుగు వికెట్ల దూరంలో శ్రీలంక..

మరిన్ని వార్తలు