Hockey WC 2023: నెదర్లాండ్స్‌ సంచలన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి చరిత్ర! ఇక భారత్‌ క్వార్టర్స్‌ అవకాశాలు?!

20 Jan, 2023 08:31 IST|Sakshi
నెదర్లాండ్స్‌ హాకీ జట్టు (PC: Hockeyindia Twitter)

FIH Men’s Hockey World Cup- భువనేశ్వర్‌: ప్రపంచ కప్‌ హకీ టోర్నీలో నెదర్లాండ్స్‌ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థి జట్టును అత్యధిక గోల్స్‌ తేడాతో ఓడించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఒడిశా వేదికగా గురవారం నాటి పూల్‌ సి మ్యాచ్‌లో భాగంగా చిలీని 14-0తో చిత్తు చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది. తద్వారా ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును డచ్‌ జట్టు బద్దలు కొట్టింది. 2010 వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 12-0తో ఓడించింది.

కాగా భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో.. నెదర్లాండ్స్‌ ఆటగాళ్లు హ్యాట్రిక్‌ వీరడు జిప్‌ జాన్సెస్‌, డెర్క్‌ డి విల్డర్‌, తిజ్స్‌ వాన్‌ డ్యామ్‌, కెప్టెన్‌ తెర్రీ బ్రింక్‌మన్‌, టెరెన్స్‌ పీటర్స్‌, కొయెన్‌ బీజెన్‌, జస్టెన్‌ బ్లాక్‌, ట్యూన్‌ బీన్స్‌ గోల్స్‌ సాధించారు. ఇక చిలీపై విజయంతో ఈ ఎడిషన్‌లో క్వార్టర్స్‌ చేరిన తొలి జట్టుగా నెదర్లాండ్స్‌ నిలిచింది.

క్రాస్‌ ఓవర్‌’కు భారత్‌..
ఇక ప్రపంచ కప్‌ హాకీ టోర్నీలో నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకునే లక్ష్యంతో గురువారం వేల్స్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన భారత్‌... కనీసం 8 గోల్స్‌ తేడాతో గెలిస్తే ‘క్రాస్‌ ఓవర్‌’ మ్యాచ్‌ అవసరం లేకుండా నేరుగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టే అవకాశం. కానీ భారత జట్టు అంతటి అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది. బలహీన జట్టే అయినా వేల్స్‌ బాగా పోటీ ఇచ్చింది.


భారత హాకీ జట్టు PC: Hockeyindia Twitter

చివరకు 4–2తో గోల్స్‌ తేడాతో భారత్‌ విజయం సాధించింది. భారత్‌ తరఫున షంషేర్‌ సింగ్‌ (21వ నిమిషం), ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (32వ నిమిషం, 45వ నిమిషం), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (59వ నిమిషం) గోల్స్‌ సాధించగా...వేల్స్‌ ఆటగాళ్లలో ఫర్లాంగ్‌ గ్యారెత్‌ (42వ నిమిషం), డ్రేపర్‌ జాకబ్‌ (44వ నిమిషం) గోల్స్‌ నమోదు చేశారు. గ్రూప్‌ ‘డి’లో ఇంగ్లండ్‌తో సమానంగా 7 పాయింట్లతో నిలిచినా...ఆడిన 2 మ్యాచ్‌లలో కలిపి మెరుగైన గోల్స్‌ ప్రదర్శన ఆధారంగా (ఇంగ్లండ్‌ 9, భారత్‌ 6) మన జట్టు రెండో స్థానంలో నిలిచింది.

క్వార్టర్‌ ఫైనల్‌ చేరాలంటే.. 
నిజానికి బలమైన ప్రత్యర్థి కాకపోయినా వేల్స్‌ ఒక దశలో భారత్‌ను బెంబేలెత్తించింది. మన టీమ్‌ కూడా అంది వచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. 7 పెనాల్టీ కార్నర్లతో పాటు ఆరు సార్లు గోల్‌ చేసే అవకాశం వచ్చినా మనవాళ్లు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. తొలి క్వార్టర్‌లో గోల్స్‌ నమోదు కాకపోగా, రెండో క్వార్టర్‌లో ఒక గోల్‌తో భారత్‌ ముందంజ వేసింది.

మూడో క్వార్టర్‌లో రెండు నిమిషాల వ్యవధిలో పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచి వేల్స్‌ స్కోరు సమం చేసింది. రెండో క్వార్టర్‌ తొలి నిమిషంలోనే భారత్‌కు పెనాల్టీ లభించగా, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ దానిని ఉపయోగించుకోలేకపోయాడు. అనంతరం హర్మన్‌ప్రీత్‌ డ్రాగ్‌ ఫ్లిక్‌ డిఫెండర్‌ స్టిక్‌కు తగిలి రీబౌండ్‌ అయి రాగా, ఈ సారి షంషేర్‌ దానిని గోల్‌ పోస్ట్‌లోకి పంపించగలిగాడు.

మేం సంతృప్తిగా లేము
అమిత్‌ రోహిదాస్‌ కూడా సరైన సమయంలో స్పందించడంలో విఫలమయ్యాడు. మూడో క్వార్టర్‌ 11వ నిమిషంలో లభించిన పెనాల్టీని అత ను కూడా విఫలం చేశాడు. చివర్లో కాస్త దూకుడు పెంచిన భారత్‌ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా  ఊపిరి పీల్చుకుంది. ‘ఈ విజయంతో మేం సంతృప్తిగా లేము. ఇది మా అత్యుత్తమ ప్రదర్శన కాదు. మరింత బాగా ఆడాల్సింది’ అని మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ వ్యాఖ్యానించాడు.  

ఇక ఆదివారం జరిగే ‘క్రాస్‌ ఓవర్‌’ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడే భారత్‌ ఆ మ్యాచ్‌లో గెలిస్తే క్వార్టర్స్‌ చేరుకుంటుంది. ఇతర మ్యాచ్‌లలో మలేసియా 3–2తో న్యూజిలాండ్‌పై, ఇంగ్లండ్‌ 4–0తో స్పెయిన్‌పై విజయం సాధించాయి.  

చదవండి: Michael Bracewell: కుటుంబంలో అంతా క్రికెటర్లే! లేట్‌ అయినా సంచలనాలు సృష్టిస్తూ! కానీ ‘ఈరోజు’ నీది కాదంతే!
సెలక్టర్లకు తలనొప్పి! పాపం గిల్‌! కిషన్‌తో రోజూ గొడవే.. అందుకే తనని బాగా తిడతా.. అయినా కూడా..

మరిన్ని వార్తలు