కాంస్య పతక పోరులో భారత్‌కు నిరాశ

13 Apr, 2022 04:39 IST|Sakshi

‘షూటౌట్‌’లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి

మహిళల జూ. ప్రపంచకప్‌ హాకీ టోర్నీ

పోష్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): జూనియర్‌ మహిళల ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో రెండోసారి కాంస్య పతకం సాధించాలని ఆశించిన భారత్‌కు నిరాశ ఎదురైంది. ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన కాంస్య పతక పోరులో భారత్‌ ‘షూటౌట్‌’లో 0–3తో ఓడిపోయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్‌’ను నిర్వహించారు. ‘షూటౌట్‌’లో భారత్‌ తరఫున వరుసగా షర్మిలా దేవి, కెప్టెన్‌ సలీమా తెతె, సంగీత కుమారి విఫలమవ్వగా... ఇంగ్లండ్‌ తరఫున కేటీ కర్టిస్, స్వయిన్, మ్యాడీ ఆక్స్‌ఫర్డ్‌ సఫలమయ్యారు.

ఫలితం తేలిపోవడంతో మరో రెండు షాట్‌లను తీసుకోలేదు. అంతకుముందు భారత్‌ తరఫున ముంతాజ్‌ ఖాన్‌ (21వ, 47వ ని.లో) రెండు గోల్స్‌ చేయగా... ఇంగ్లండ్‌ జట్టుకు మిలీ గిజిలో (18వ ని.లో), క్లాడియా స్వయిన్‌ (58వ ని.లో) ఒక్కో గోల్‌ అందించారు. మ్యాచ్‌ ముగియడానికి రెండు నిమిషాల వరకు భారత్‌ 2–1తో ఆధిక్యంలో ఉన్నా చివర్లో తడబడి ఇంగ్లండ్‌కు స్కోరును సమం చేసే అవకాశమిచ్చింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ 2013లో భారత్‌ చేతిలో కాంస్య పతక పోరులో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నట్లయింది. 2013లో భారత్‌ ‘షూటౌట్‌’లో ఇంగ్లండ్‌ను ఓడించి కాంస్య పతకం గెలిచింది. ఈసారి మాత్రం భారత్‌ ఆ ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. జర్మనీతో జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్‌ 3–1తో గెలిచి నాలుగో సారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.

మరిన్ని వార్తలు