Ben Stokes: అప్పుడు విలన్‌.. ఇప్పుడు హీరో

14 Nov, 2022 08:09 IST|Sakshi

అది 2016 టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌. ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 155 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో వెస్టిండీస్‌ 19 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో విజయానికి 19 పరుగులు కావాలి. అప్పటివరకు ఇంగ్లండ్‌ బౌలింగ్‌ చూస్తే కచ్చితంగా ఆ జట్టుదే విజయం అనిపించింది. ఈ నేపథ్యంలో ఆఖరి ఓవర్‌ బెన్‌ స్టోక్స్‌ వేశాడు.

క్రీజులో ఉన్న కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ నాలుగు వరుస బంతులను నాలుగు సిక్సర్లుగా మలిచి విండీస్‌కు మరిచిపోలేని విజయాన్ని అందించి రెండోసారి విశ్వవిజేతగా నిలిపాడు.ఈ చర్యతో మైదానంలోనే కూలబడిన స్టోక్స్‌ కన్నీటిపర్యంతం అయ్యాడు. చేతిదాకా వచ్చిన వరల్డ్‌కప్‌ తనవల్లే చేజారిందంటూ మ్యాచ్‌ అనంతరం ఎమోషనల్‌ అయ్యాడు. 

కట్‌చేస్తే ఇప్పుడదే స్టోక్స్ ఇంగ్లండ్ ను టి20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలపడం విశేషం. పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్లో స్టోక్స్ ఆడిన ఇన్నింగ్స్‌ అద్బుతమని చెప్పొచ్చు. మధ్యలో పాక్‌ బౌలర్లు తమ లయను అందుకొని వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఇంగ్లండ్‌ ఒత్తిడిలో పడినట్లుగా కనిపించింది. కానీ ఈసారి వరల్డ్‌కప్‌ చేజార్చుకోవడం ఇష్టంలేని స్టోక్స్‌ చివరి వరకు వెన్నెముకలా నిలిచాడు. 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచి 48 మ్యాచ్‌ల టి20 కెరీర్‌లో తొలి అర్థసెంచరీ చేయడంతో పాటు ఇంగ్లండ్‌ను రెండోసారి విశ్వవిజేతగా నిలిపాడు. 2016లో విలన్‌గా నిలిచిన స్టోక్స్‌ తాజాగా జట్టును గెలిపించి హీరో అయ్యాడు.

చదవండి: ఇంగ్లండ్‌ గెలుపులో మూల స్తంభాలు..

మరిన్ని వార్తలు