World Cup 2022: వర్షం పడితేనే.. కానీ అలా జరుగలేదు..

25 Mar, 2022 13:49 IST|Sakshi

Update: దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఓటమి పాలైంది. దీంతో ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్‌-2022 నుంచి మిథాలీ సేన సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించింది.

మహిళల వన్డే ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాప్రికా జట్లు సెమీఫైనల్‌ బెర్త్‌లను ఖరారు చేసుకోగా.. భారత్‌, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ జట్లు మరో రెండు స్ధానాల కోసం పోటీ పడుతున్నాయి. సోమవారం(మార్చి 28) క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్‌ జట్టు చావోరేవో తేల్చుకోనుంది. మరోవైపు ఇంగ్లండ్‌ తమ ఆఖరి మ్యాచ్‌లో ఆదివారం(మార్చి 27) బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

అయితే బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్‌ విజయం లాంఛనమే అని చెప్పుకోవాలి. ఇంగ్లండ్ వంటి మేటి జట్టును బంగ్లాదేశ్‌ వంటి పసి కూన ఓడించడం అంత సులభం కాదు. కాబట్టి దక్షిణాఫ్రికాపై భారత్‌ కచ్చితంగా విజయం సాధించాలి. దక్షిణాఫ్రికాపై భారత్‌ విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్‌కు చేరుతుంది. ఒకవేళ ఓటమి చెందితే భారత్‌ ఇంటిముఖం పట్టక తప్పదు.

ఎందుకంటే 7 పాయింట్లతో వెస్టిండీస్‌ సెమీఫైనల్లో అడుగు పెడుతుంది. మరోవైపు రానున్న మూడు రోజులు పాటు క్రైస్ట్‌చర్చ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతవారణ శాఖ తెలిపింది. ఒక వేళ దక్షిణాఫ్రికా-భారత్‌ మ్యాచ్‌ రద్దు అయితే ఇరు జట్లుకు చెరో పాయింట్‌ లభిస్తుంది. దీంతో భారత్‌ జట్టు 7 పాయింట్లతో విండీస్‌తో సమంగా నిలుస్తుంది. అయితే వెస్టిండీస్‌(-0.890) రన్‌రేట్ కంటే భారత్‌(+0.768) మెరుగ్గా ఉంది. దీంతో భారత్‌ సెమీస్‌కు చేరుకుంటుంది.

ఇక గురువారం జరగాల్సిన దక్షిణాఫ్రికా- వెస్టిండీస్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ జట్లకు చెరో పాయింట్‌ లభించింది. ఈ క్రమంలో 7 పాయింట్లతో వెస్టిండీస్‌ పాయిం‍ట్ల పట్టికలో మూడో స్ధానానికి చేరుకుంది. భారత్‌ 6 పాయింట్లతో ఐదో స్ధానంలో ఉంది. మరోవైపు శుక్రవారం(మార్చి 25)న బం‍గ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి అజేయ రికార్డును కొనసాగించి అగ్ర స్థానాన్ని పదిలం చేసుకుంది.

చదవండి: World Cup 2022: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన ఆసీస్‌.. ఏడింటికి ఏడు గెలిచి.. అజేయ రికార్డుతో

మరిన్ని వార్తలు