'కోచ్ లేని లోటు ధోని తీర్చేవాడు'

31 Jul, 2020 15:53 IST|Sakshi

ముంబై : ఎంఎస్ ధోని గురించి ఎన్నిసార్లు చ‌ర్చించుకున్నా ప్ర‌తీసారి ఏదో ఒక కొత్త విష‌యం తెలుస్తుంటుంది. కెప్టెన్‌గా ధోని ఎంత స‌క్స్‌స్ అయ్యాడ‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రంలేదు. బౌలింగ్ స‌మ‌యంలో వికెట్ల వెనుకాల నిల‌బ‌డి బౌలింగ్ టీమ్‌కు విలువైన సూచ‌నలు చేస్తూ ఎన్నో మ్య‌చ్‌లు గెలిపించాడు. తాజాగా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ధోనిని ప్రశంసల్లో ముంచెత్తాడు. మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు తనకు కోచ్ లేని లోటును ధోనీ తీర్చేవాడని చెప్పాడు. బౌలింగ్ స‌మ‌యాల్లో నాతో పాటు స‌హ‌చ‌ర స్పిన్న‌ర్ య‌జువేంద్ర చ‌హ‌ల్‌కు ఎన్నో‌సార్లు విలువైన స‌ల‌హాలిచ్చేవాడు.

‘ధోనీ నా ఎదురుగా ఉంటే నాకు కోచ్ లేడనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతా. మ్యాచ్ ఆసాంతం ఓ కోచ్ ఎలాంటి సలహాలు, సూచనలు అయితే ఆటగాళ్లకు ఇస్తాడో, అవన్నీ ధోనీ నాకు ఇచ్చేవాడు. ప్రతి విషయంలో నాకు అండగా ఉండేవాడు. ఎక్కువగా బంతిని గింగిరాలు తిప్పడంపైనే దృష్టి సారించమని ధోనీ సూచించేవాడు. అతడు వికెట్ల వెనక ఉన్నాడంటే చాలు ఒత్తిడి మొత్తం పోతుంది. అంతేకాకుండా ఫీల్డింగ్ సెట్ చేసే సమయంలో నాకు సూచనలిచ్చేవాడని, కొన్నిసార్లు ధోనీయే మొత్తం ఫీల్డర్లను సెట్ చేసి ఏ బంతి వేయాలో కూడా ముందుగానే చెప్పేవాడు.

ప్ర‌స్తుత కెప్టెన్ కోహ్లి కూడా ఇలాగే చేస్తున్నా.. ధోని కూడా మాతో ఉంటే బాగుండు అని అప్పుడ‌ప్పుడు అనిపిస్తుంటుంది. అంతేకాదు నేను టెస్టుల్లో అరంగేట్రం చేయ‌డానికి ఒక్క‌రోజు ముందు దిగ్గ‌జ లెజెండ‌రీ స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లే నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. రాబోయే మ్యాచ్‌లో 5 వికెట్లు తీయాల‌ని నాతో అన్నాడు. నాకు అర్థంకాక కొద్దిసేపు అలాగే నిల‌బడిపోయాను. త‌ర్వాత క‌చ్చితంగా 5 వికెట్లు తీస్తాన‌ని చెప్పాను.' అంటూ కుల్దీప్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు