Impact Player: క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. కొత్త నిబంధన అమల్లోకి

12 Oct, 2022 09:20 IST|Sakshi

సాధారణంగా క్రికెట్‌లో సబ్‌స్టిట్యూట్‌ అంటే ఫీల్డర్‌ గాయపడితే అతని స్థానంలో మైదానంలోకి వస్తాడు. కానీ అతనికి ఫీల్డింగ్‌ మినహా బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసే అవకాశం ఉండదు. అయితే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చే ఆటగాడికి బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసేలా బీసీసీఐ ''ఇంపాక్ట్‌ ప్లేయర్‌'' పేరిట కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధన జట్టు కెప్టెన్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. బ్యాటింగ్‌లో చెలరేగిన ఒక ఆటగాడు బౌలింగ్‌ చేయాల్సిన అవసరం లేనప్పుడు అతని స్థానంలో ఒక బౌలర్‌ను తీసుకునే అవకాశం కెప్టెన్‌కు ఉంటుంది.

తాజాగా బీసీసీఐ తెచ్చిన ''ఇంపాక్ట్‌ ప్లేయర్‌'' నిబంధనను సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో తొలిసారి ఉపయోగించారు. టోర్నీలో భాగంగా ఎలైట్‌ గ్రూఫ్‌-బిలో ఢిల్లీ, మణిపూర్‌ మధ్య మ్యాచ్‌లో హృతిక్‌ షోకీన్‌ తొలి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. త్వరలోనే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనను ఐపీఎల్‌లో కూడా అమలు చేయనున్నారు.

ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్‌ హితెన్‌ దలాల్‌(27 బంతుల్లో 47 పరుగులు, 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించాడు. యష్‌ దుల్‌ 24, హిమ్మత్‌ సింగ్‌ 25 పరుగులు చేశారు. అయితే బ్యాట్‌తో రాణించిన హితెన్‌ దలాల్‌ బౌలింగ్‌ చేయలేడు కాబట్టి కెప్టెన్‌ నితీష్‌ రాణా అతని స్థానంలో బౌలర్‌ హృతిక్‌ షోకీన్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా తీసుకొచ్చాడు. ఇది ఢిల్లీ జట్టుకు లాభం చేకూర్చింది.

బౌలింగ్‌లో షోకీన్‌(3-0-13-2) చెలరేగడంతో ఢిల్లీ విజయాన్ని అందుకుంది. షోకీన్‌తో పాటు మయాంక్‌ యాదవ్‌ కూడా రెండు వికెట్లు తీయడం.. నితీష్‌ రాణా, లలిత్‌ యాదవ్‌లు చెరొక వికెట్‌ తీయడంతో మణిపూర్‌ 96 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత కాసేపటికే మణిపూర్‌ కెప్టెన్‌ లాంగ్లోన్యాంబ కీషాంగ్బామ్ కూడా బౌలర్‌ బిష్వోర్జిత్‌ స్థానంలో బ్యాటర్‌ అహ్మద్‌ షాను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా తీసుకొచ్చాడు. 

చదవండి: 'ఏదైనా సాధిస్తేనే ఇంటికి రా'

గంగూలీ కథ ముగిసినట్లే..!

మరిన్ని వార్తలు