కోట్లకు... ఆటకు కుదరని మైత్రి

16 Oct, 2020 05:15 IST|Sakshi

ఐపీఎల్‌లో ‘భారీ’ ఆటగాళ్లు విఫలం

ఫ్రాంచైజీలకు కలిసి రాని కోటీశ్వరులు

అంచనాలను అందుకోలేకపోయిన వైనం

ఐపీఎల్‌లో ‘భారీ’ ఆటగాళ్లు విఫలం

ఐపీఎల్‌ అంటేనే అంకెలు... పరుగులు, వికెట్లు మాత్రమే కాదు, ఆటగాళ్లకి చెల్లించే ప్రతీ పైసా లెక్కలు కూడా కీలకం. డబ్బే ముఖ్యం కాదు అంటూ బయటకు ఎన్ని మాటలు చెప్పినా, క్రికెటర్లు సహజంగానే భారీ మొత్తాలను కోరుకుంటారు. అటు టీమ్‌ యాజమాన్యాలు కూడా తాము చెల్లిస్తున్న సొమ్ముకు తగి నంత ప్రతిఫలాన్ని సదరు ఆటగాడి నుంచి ఆశిస్తాయి. దాంతో క్రికెటర్లపై కచ్చితంగా రాణించాల్సిన ఒత్తిడి ఉంటుంది. చాలాసార్లు ఆ భారాన్ని మోయలేక క్రికెటర్లు విఫలమైతే, కొన్నిసార్లు మాత్రం వారు అంచనాలు అందుకుంటారు. చేసే ప్రతీ పరుగును, తీసే ప్రతీ వికెట్‌ను ఇచ్చిన మొత్తంతో గుణింతాలు, భాగహారాలతో లెక్కించి పోల్చడం సహజం. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌–2020లో ఇప్పటివరకు ‘భారీ’ ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలిస్తే....  
ప్యాట్‌ కమిన్స్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌)

వేలంలో విలువ: రూ. 15 కోట్ల 50 లక్షలు
ప్రదర్శన: ఐపీఎల్‌ చరిత్రలో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన బౌలర్‌గా కమిన్స్‌ ఈసారి బరిలోకి దిగాడు. టెస్టుల్లో నంబర్‌వన్‌ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కమిన్స్‌ టి20లకు వచ్చేసరికి తేలిపోయాడు. యూఏఈలోని నెమ్మదైన పిచ్‌లు కూడా అతని శైలికి ఏమాత్రం సరిపోకపోవడంతో ఇప్పటికీ లయ అందుకునేందుకు అతను తిప్పలు పడుతూనే ఉన్నాడు. 7 మ్యాచ్‌లలో ఒక్కసారీ ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన ప్రదర్శన లేకపోగా... 2 వికెట్లే తీసిన అతను కనీసం ఒక్క ఓవర్‌ కూడా మెయిడిన్‌గా వేయలేకపోయాడు. 111 సగటు అతి పేలవం కాగా... 8.53 ఎకానమీ చూస్తే భారీగా పరుగులిచ్చినట్లు అర్థమవుతోంది. ఇది కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సమస్యగా మారింది.  

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌)

వేలంలో విలువ: రూ. 10 కోట్ల 75 లక్షలు
ప్రదర్శన: ఒకప్పుడు విధ్వంసానికి చిరునామాగా నిలిచిన మ్యాక్స్‌వెల్‌ ఇప్పుడు ఒక్కో పరుగు కోసం శ్రమిస్తున్నాడు. నిజానికి ఇంత మొత్తం చెల్లించి తీసుకున్న ఆటగాడిని ఎలా వాడుకోవాలో కూడా అర్థం కాని స్థితిలో పంజాబ్‌ ఉంది. 8 మ్యాచ్‌లలో కలిపి అతను ఆడింది 61 బంతులే... దాదాపు మ్యాచ్‌ ముగిసే సమయంలో క్రీజ్‌లోకి వస్తున్న అతను బంతులకంటే తక్కువ పరుగులు (58) చేయడం ఆశ్చర్యకరం. కోల్‌కతాతో మ్యాచ్‌లో 16 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా మ్యాక్స్‌వెల్‌కంటే ముందు కనీసం ఒక ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ అనుభవం కూడా లేని ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ను పంపించారంటే మ్యాక్స్‌వెల్‌పై ఎంత అపనమ్మకమో అర్థమవుతుంది. లీగ్‌లో అతను ఒక్క సిక్సర్‌ కూడా కొట్టలేదు. అతనికి చెల్లించిన మొత్తంతో పోలిస్తే మ్యాక్సీ ప్రదర్శన అట్టర్‌ ఫ్లాప్‌.  

షెల్డన్‌ కాట్రెల్‌ (పంజాబ్‌)

వేలంలో విలువ: రూ. 8 కోట్ల 50 లక్షలు
ప్రదర్శన: ప్రధాన పేసర్‌గా పంజాబ్‌ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘సెల్యూట్‌’ కాట్రెల్‌ దానికి తగినట్లుగా రాణించలేకపోయాడు. 6 మ్యాచ్‌లలో 6 వికెట్లే తీయగా... 8.80 ఎకానమీ చూస్తే పరుగులు నిరోధించడంలో కూడా అతను విఫలమైనట్లు కనిపిస్తోంది. గత రెండు మ్యాచ్‌లలో తుది జట్టు నుంచి తప్పించడాన్ని చూస్తే సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లలో కూడా పంజాబ్‌ అతడికి అవకాశం ఇస్తుందా లేదా అనేది సందేహమే.  

జైదేవ్‌ ఉనాద్కట్‌ (రాజస్తాన్‌ రాయల్స్‌)

వేలంలో విలువ: రూ. 3 కోట్లు
ప్రదర్శన: గతంలో ఐపీఎల్‌ వేలంలో రెండుసార్లు రికార్డు స్థాయి మొత్తాలకు అమ్ముడుపోయి అంతగా రాణించలేకపోయిన ఉనాద్కట్‌... వాటితో పోలిస్తే ఈసారి తక్కువ మొత్తానికే రాజస్తాన్‌కు అందుబాటులోకి వచ్చాడు. లీగ్‌కు ముందు సౌరాష్ట్ర కెప్టెన్‌గా జట్టుకు తొలి రంజీ ట్రోఫీ అందించిన ఆత్మవిశ్వాసంతో కనిపించిన అతను లీగ్‌కు వచ్చేసరికి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 6 మ్యాచ్‌లలో కలిపి అతను తీసింది 4 వికెట్లే.  చెప్పుకోదగ్గ స్పెల్‌ ఒక్కటి కూడా వేయని ఉనాద్కట్‌ 9.57 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు.  

ఆరోన్‌ ఫించ్‌ (బెంగళూరు)

వేలంలో విలువ: రూ. 4 కోట్ల 40 లక్షలు
ప్రదర్శన: ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి ఓవరాల్‌ ప్రదర్శన పర్వాలేదన్నట్లుగా కనిపిస్తున్నా, ఆస్ట్రేలియాలాంటి మేటి జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్‌ నుంచి ఆశించింది మాత్రం ఇది (ఒక అర్ధసెంచరీ) కాదు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక స్కోరు సాధించిన ఈ ఆటగాడి స్ట్రయిక్‌రేట్‌ 113.69 మాత్రమే, అదీ ఓపెనర్‌గా ఉంటూ చేయడం అంటే వైఫల్యం కిందే లెక్క. ఒక్క విధ్వంసకర ఇన్నింగ్స్‌ కూడా అతడినుంచి రాలేదు.  

రాబిన్‌ ఉతప్ప (రాజస్తాన్‌ రాయల్స్‌)

వేలంలో విలువ: రూ. 3 కోట్లు
ప్రదర్శన: గతంలో కోల్‌కతా జట్టులో కీలక సభ్యుడిగా ఆ జట్టు రెండు టైటిల్స్‌ సాధించడంలో భాగమైన రాబిన్‌ ఉతప్పలో జోరు తగ్గినా... రాజస్తాన్‌ పెద్ద మొత్తానికి అతడిని తీసుకుంది. అయితే ఉతప్ప మరింత పేలవంగా ఆడి ఫ్రాంచైజీని నిరాశపర్చాడు. 6 మ్యాచ్‌లలో కలిపి ఉతప్ప చేసింది 83 పరుగులే (84 బంతుల్లో). తుది జట్టులో భారత ఆటగాళ్లను ఎంచుకునే క్రమంలో ఉతప్ప వైఫల్యం రాయల్స్‌ కూర్పును దెబ్బ తీసింది.  

ఇది భిన్నమైన పరిస్థితి...
ఆస్ట్రేలియా లెఫ్టార్మ్‌ పేసర్‌ నాథన్‌ కూల్టర్‌నైల్‌ను ముంబై రూ. 8 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అతడిని తుది జట్టులో ఆడించేందుకు వారికి అవకాశం లభించడం లేదు. బౌల్ట్‌ చక్కగా రాణిస్తుండగా, ముంబై తుది జట్టు చక్కగా కుదురుకోవడంతో మార్పులకు అవకాశం లేకుండా పోయింది. పూర్తి ఫిట్‌గా ఉన్నా మ్యాచ్‌ ఆడే అవకాశం లభించని కూల్టర్‌నైల్‌ పర్సులో మాత్రం భారీ మొత్తం చేరడం విశేషం. రూ. 10 కోట్లు ఇచ్చిన క్రిస్‌ మోరిస్‌ (దక్షిణాఫ్రికా)ను బెంగళూరు ఇప్పటికి మూడు మ్యాచ్‌లు ఆడించింది. ఇకపై అతడికి వరుసగా అన్ని మ్యాచ్‌లలో అవకాశం దక్కవచ్చు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు