క్రికెట్‌లో సరికొత్త ఫార్మాట్‌ 'ద హండ్రెడ్‌'.. రూల్స్ ఇలా ఉండబోతున్నాయి

13 Jul, 2021 17:30 IST|Sakshi

The Hundred Rules: వందేళ్లకుపైగా ఘన చరిత్ర కలిగిన క్రికెట్‌ క్రీడ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గా అభిమానుల ముందుకు వస్తూనే ఉంది. ఈ ఆటలో తొలుత సాంప్రదాయ టెస్ట్‌ క్రికెట్‌ మాత్రమే భాగంగా కాగా, ఆతర్వాతి కాలంలో వ‌న్డేలు, టీ20లు, టీ10 లీగ్‌లు వచ్చి చేరాయి. ఇప్పుడు తాజాగా హండ్రెడ్ పేరుతో మ‌రో కొత్త ఫార్మాట్‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇన్నింగ్స్‌కు 100 బంతుల చొప్పున ఉండే ఈ ఫార్మాట్‌లో ఎనిమిది పురుషుల జట్లు, ఎనిమిది మహిళా జట్లు ఉంటాయి. తాజాగా దీనికి సంబంధించిన నియమ నిబంధ‌న‌ల‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విడుదల చేసింది. దీంతో ఈ సరికొత్త ఫార్మాట్ ఎలా ఉండబోతుందోనని సర్వత్రా ఆస‌క్తి నెలకొంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన రూల్స్‌ ఎలా ఉండబోతున్నాయో ఓసారి చూద్దాం.

* ఈ కొత్త ఫార్మాట్‌లో టాస్ గ్రౌండ్‌లోనే వేయాల‌న్న రూలేమీ లేదు.
* ఈ ఫార్మాట్‌లో ఓవ‌ర్లు ఉండ‌వు. బాల్స్ ఆధారంగానే ఇన్నింగ్స్ మారుతుంది. ఒక బౌల‌ర్ ఒకే ఎండ్ నుంచి రెండుసార్లు ఐదేసి బంతులు వేయాల్సి ఉంటుంది. తొలి ఐదు బంతులు ముగిసిన త‌ర్వాత అంపైర్ ఓ వైట్ కార్డు చూపిస్తాడు. ఓ సెట్ పూర్తయిన‌ట్లుగా ప్రేక్ష‌కులు, స్కోర‌ర్లు, కామెంటేట‌ర్లు, బ్రాడ్‌కాస్ట‌ర్ల‌కు తెలియ‌డానికి ఇలా చేస్తారు.
* ఇందులో తొలి 25 బంతులు ప‌వ‌ర్ ప్లేగా పరిగణించబడతాయి. ఈ స‌మ‌యంలో 30 గ‌జాల స‌ర్కిల్ బ‌య‌ట ఇద్ద‌రు ఫీల్డ‌ర్ల‌కు మాత్రమే అనుమ‌తి ఉంటుంది.
* ప‌వ‌ర్ ప్లే ముగిసాక ఫీల్డింగ్ టీమ్ ఎప్పుడైనా రెండు నిమిషాల స్ట్రేట‌జిక్ టైమౌట్(బ్రేక్‌) తీసుకోవ‌చ్చు.
* అలాగే, బ్యాట్స్‌మెన్ క్యాచ్ అవుటైన త‌ర్వాత అవ‌త‌లి బ్యాట్స్‌మ‌న్ క్రాస్ అయ్యాడా లేదా అన్న‌దానితో సంబంధం లేకుండా కొత్త బ్యాట్స్‌మ‌న్ స్ట్రైక్ తీసుకోవాలి.
* గ్రూప్ స్టేజ్‌లో మ్యాచ్‌ టై అయితే రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభిస్తుంది. అదే ఎలిమినేట‌ర్‌, ఫైన‌ల్లో టై అయితే.. సూప‌ర్ ఫైవ్ ఆడాల్సి ఉంటుంది. అంటే ఒక్కో టీమ్ ఐదు బాల్స్ ఆడాల్సి ఉంటుంది.
* ఒక‌వేళ సూప‌ర్ ఫైవ్ కూడా టై అయితే.. మ‌రో సూప‌ర్ ఫైవ్ ఆడిస్తారు. అది కూడా టై అయితే.. గ్రూప్ స్టేజ్‌లో టాప్‌లో ఉన్న జట్టును విజేత‌గా ప్ర‌క‌టిస్తారు.
* వ‌ర్షం వ‌ల్ల ప్ర‌భావిత‌మైన మ్యాచ్‌ల‌లో కొత్త డీఎల్ఎస్ ప‌ద్ధ‌తిని అమలు చేస్తారు.
* ఒకవేళ జట్టు నెమ్మ‌దిగా బౌలింగ్ చేస్తుంద‌నుకుంటే అంపైర్‌కే పెనాల్టీ విధించే హక్కు ఉంటుంది. ఇలా జరిగితే ఫీల్డింగ్ టీమ్‌కు స‌ర్కిల్ బ‌య‌ట ఒక ఫీల్డ‌ర్‌ను త‌గ్గించాల్సి ఉంటుంది

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు