Indian Super League 2022: ఐఎస్‌ఎల్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీకి తొలి విజయం

14 Oct, 2022 07:03 IST|Sakshi

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ హైదరాబాద్‌ ఎఫ్‌సీ తొలి విజయాన్ని అందుకుంది. గురువారం నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీతో జరిగిన పోరులో హైదరాబాద్‌ 3–0తో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జోరు ముందు నార్త్‌ఈస్ట్‌ జట్టు తేలిపోయింది. మ్యాచ్‌ ఆరంభమైన 13వ నిమిషంలోనే బార్తొలొమి ఒబెచ్‌ గోల్‌ చేయడంతో 1–0తో హైదరాబాద్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై క్రమం తప్పకుండా దాడులకు పదునుపెట్టిన డిఫెండింగ్‌ చాంపియన్‌ రెండో అర్ధభాగంలో మరో రెండు గోల్స్‌ చేసింది. హలిచరన్‌ నర్జరీ (69వ ని.), బొర్జ హెరెరా (73వ ని.) నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేయడంతో హైదరాబాద్‌ విజయం ఖాయమైంది.   ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌ను 3–3తో డ్రా చేసుకున్న హైదరాబాద్‌ జట్టు   ప్రదర్శన ఈ మ్యాచ్‌లో మరింత మెరుగైంది.  

మరిన్ని వార్తలు