Indian Racing League: రెడీ టూ రైడ్‌.. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌కు సర్వం సిద్దం

18 Nov, 2022 09:51 IST|Sakshi

రేపటి ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌కు సర్వం సన్నద్ధం

నగరానికి చేరుకున్న రేసింగ్‌ కార్లు

నెక్లెస్‌రోడ్డు వద్ద ట్రాక్‌ నాణ్యతను పరిశీలించిన నిపుణులు

వివిధ మార్గాల్లో వాహనాల మళ్లింపు

శనివారం మధ్యాహ్నం ప్రారంభం కానున్న లీగ్‌ పోటీలు

సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్‌ తీరం ఉత్కంఠభరితమైన పోటీలకు సిద్ధమైంది. ఆహ్లాదభరితమైన సాగరతీరంలో కన్ను మూసి తెరిచే లోపు వాయువేగంతో రయ్‌ మంటూ దూసుకుపోయే ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ కార్ల పోటీలు మరి కొద్ది గంటల్లో కనువిందు చేయనున్నాయి. ఈ పోటీల నిర్వహణ  కోసం  హెచ్‌ఎండీఏ  అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పటిష్టమైన ట్రాక్‌ను సిద్ధం చేశారు. పోటీల్లో  పాల్గొననున్న కార్లు నగరానికి చేరుకున్నాయి.

పోటీలను  వీక్షించేందుకు అనుగుణంగా నెక్లెస్‌రోడ్డులో గ్యాలరీలను ఏర్పాటు చేశారు. కొద్ది రోజులుగా బుక్‌ మై షో ద్వారా పాస్‌ల అమ్మకాలను చేపట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి  11వ తేదీన జరుగనున్న ఫార్ములా–ఈ  ఎలక్ట్రిక్‌ కార్ల పోటీలను దృష్టిలో ఉంచుకొని ట్రయల్‌ రన్‌గా ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ఈ పోటీలకు  సన్నద్ధమైంది. ఈ నెల 19, 20 తేదీలతో పాటు, డిసెంబర్‌  10, 11 తేదీల్లో  ఈ పోటీలు జరుగనున్నాయి. శని, ఆదివారం నాటి  పోటీల్లో  పాల్గొనేందుకు 12 రేసింగ్‌ కార్లు నగరానికి చేరుకున్నాయి.  

అత్యంత పటిష్టంగా స్ట్రీట్‌ సర్క్యూట్‌ ట్రాక్‌ 
శని, ఆదివారాలు రెండు రోజుల పాటు  జరుగనున్న ఈ పోటీల్లో  17 చోట్ల మలుపులతో కూడిన  2.8 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ట్రాక్‌పైన కార్లు  పరుగులు తీయనున్నాయి. గంటకు సుమారు 250 కిలోమీటర్ల వేగంతో కార్లు పరుగులు తీసేవిధంగా స్ట్రీట్‌ సర్క్యూట్‌ ట్రాక్‌ను అత్యంత పటిష్టంగా రూపొందించారు.

శనివారం ఈ పోటీలు ప్రారంభం కానున్న దృష్ట్యా నిపుణులు గురువారం మరోసారి ట్రాక్‌ను పరిశీలించారు. ఇతరులు నెక్లెస్‌రోడ్డులోకి ప్రవేశించకుండా పోలీసులు ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టారు. నెక్లెస్‌రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను వివిధ మార్గాల్లోకి మళ్లించారు. 

ఏమిటీ రేసు... 
2019లో తొలిసారి ఎక్స్‌1 రేసింగ్‌ లీగ్‌ పేరుతో పోటీలు జరిగాయి. దీనిని స్వల్ప మార్పులతో ఇప్పుడు ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌గా మార్చారు. ఇంటర్నేషనల్‌ ఆటోమొబైల్‌ ఫెడరేషన్‌ (ఎఫ్‌ఐఏ) గుర్తింపు పొందిన ఫార్ములా రీజినల్‌ ఇండియన్‌ చాంపియన్‌షిప్, ఎఫ్‌4 ఇండియన్‌ చాంపియన్‌షిప్‌తో పాటు ఇది జరగాల్సి ఉంది. అయితే ఈ రెండు ఈవెంట్లు వాయిదా పడగా, ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ను మాత్రం నవంబర్‌ – డిసెంబర్‌లలో హైదరాబాద్, చెన్నై వేదికలుగా నిర్వహిస్తున్నారు.  


 
కారు ఎలా ఉంటుంది... 

సింగిల్‌ డ్రైవర్‌ ఎఫ్‌3 డిజైన్‌ కార్లు ఉంటాయి. ఇటలీకి చెందిన ‘వుల్ఫ్‌’ కంపెనీ వీటిని తయారు చేసింది. పురుషులు, మహిళల మధ్య రేసింగ్‌లో తేడా రాకుండా ఎఫ్‌3 డిజైన్‌ కారు నిర్మాణం ఉంటుంది. రేసింగ్‌ ప్రమోషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఆర్‌పీపీఎల్‌) ఈ పోటీలను నిర్వహిస్తోంది. భారత్‌లో భవిష్యత్తుల్లో కార్‌ రేసింగ్‌ స్థాయి పెంచేందుకు ఈ ఈవెంట్‌ ఉపయోగపడుతుందని ఆర్‌పీపీఎల్‌ చైర్మన్‌ అఖిలేశ్‌ రెడ్డి వెల్లడించారు.   

ఎన్ని రేస్‌లు... 
ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌లో భాగంగా మొత్తం నాలుగు రేస్‌లు జరుగుతాయి. తొలి, చివరి రేస్‌లకు హైదరాబాద్‌ వేదిక కాగా, మధ్యలో రెండు రేస్‌లు చెన్నైలో జరుగుతాయి. నాలుగు రేస్‌లలో వచ్చిన ఫలితాలను బట్టి తుది విజేతను నిర్ణయిస్తారు. హైదరాబాద్‌లో డిసెంబర్‌ 10–11 తేదీల్లో 
చివరి రేస్‌ నిర్వహిస్తారు.  
 
బరిలో 22 కార్లు.. గరిష్ట వేగం 250 కి.మీ 
హైదరాబాద్‌ అంచెలో భాగంగా శని, ఆదివారాల్లో రేస్‌లు జరుగుతాయి. మధ్యాహ్నం 3 గంటనుంచి 5 గంటల వరకు రేస్‌ జరుగుతుంది. తొలి రోజు రెండు క్వాలిఫయింగ్‌ రేసులతో పాటు ఒక ప్రధాన రేసు జరుగుతుంది. ఆదివారం మరో రెండు ప్రధాన రేస్‌లు జరుగుతాయి. గరిష్టంగా 40 నిమిషాల పాటు రేస్‌ ఉంటుంది. మొత్తం 22 కార్లు బరిలో ఉంటాయి. కార్ల గరిష్ట వేగం 250 కిలో మీటర్ల వరకు ఉంటుంది. మొత్తం 17 మలుపులతో రేస్‌ ఆసక్తికరంగా సాగనుంది.  

ఎలా చూడవచ్చు... 
స్టార్‌ స్పోర్ట్స్‌లో పోటీల ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది...అయితే నేరుగా చూడాలనుకునేవారి కోసం టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక రోజుకైతే రూ.749, రెండు రోజులకైతే రూ. 1,249 చొప్పున టికెట్లు బుక్‌ మై షోలో అందుబాటులో ఉన్నాయి.  


 
జట్ల వివరాలు... 
హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్, గోవా ఏసెస్, చెన్నై టర్బో రైడర్స్, బెంగళూరు స్పీడ్‌స్టర్స్, స్పీడ్‌ డెమాన్స్‌ ఢిల్లీ పేరుతో 5 టీమ్‌లో ఉన్నాయి. హైదరాబాద్‌ టీమ్‌లో రేసింగ్‌లో ఏడేళ్ల అనుభవం ఉన్న అనిందిత్‌ రెడ్డి ప్రధాన ఆకర్షణ. మాజీ పార్లమెంట్‌ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కుమారుడే అనిందిత్‌. నీల్‌ జానీ, ఒలివర్‌ జేమ్స్, రౌల్‌ హైమెన్‌వంటి గుర్తింపు ఉన్న రేసర్లతో పాటు మహిళల విభాగంలో ప్రముఖ రేస ర్‌ నికోల్‌ హవ్దా చెన్నై తరఫున బరిలోకి దిగుతోంది.  

భవిష్యత్తు... 
పూర్తి స్థాయి సర్క్యూట్‌ లేనందున ప్రస్తుతానికి హైదరాబాద్‌లో ఉన్నది ‘స్ట్రీట్‌ సర్క్యూట్‌’ మాత్రమే. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న నగరంలో ప్రతిష్టాత్మక ఫార్ములా ‘ఇ’ రేస్‌ జరగనుంది. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌తో పోలిస్తే దానిస్థాయి చాలా పెద్దది. ఆ రేసు కూడా ఇదే ట్రాక్‌పై జరగనుంది కాబట్టి దానికి ముందు సన్నాహకంగా ఈ రేసింగ్‌ లీగ్‌ను చూడవచ్చు.   

ట్రాక్‌ ఎలా ఉంటుంది... 
లీగ్‌లో చెన్నైలో జరిగే పోటీలను అసలైన ‘రేసింగ్‌ సర్క్యూట్‌’లోనే జరుగుతుంది. హైదరాబాద్‌లో మాత్రం ఇది భిన్నం. దీనిని ‘స్ట్రీట్‌ సర్క్యూట్‌’గా వ్యవహరిస్తున్నారు. అంటే రేస్‌ ముగిసిన తర్వాత మళ్లీ అదే ట్రాక్‌ సాధారణ రోడ్డుగా వాడకంలోకి వస్తుంది.

కొత్త రేస్‌ కోసం మళ్లీ అవసరమైతే ట్రాక్‌ను సిద్ధం చేస్తారు. ఎన్టీఆర్‌ మార్గ్‌ను విస్తరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్‌ను ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌లో స్ట్రీట్‌ రేసింగ్‌ జరగడం కూడా ఇదే మొదటిసారి.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: FIFA WC 2022: ఆరో టైటిల్‌ వేటలో బ్రెజిల్‌

మరిన్ని వార్తలు