విషాదం: మాజీ క్రికెటర్ అశ్విన్‌ యాదవ్‌ ఇకలేరు 

24 Apr, 2021 20:52 IST|Sakshi

ఫాస్ట్ బౌలర్ అశ్విన్ యాదవ్ గుండెపోటుతో  కన్నుమూత

సాక్షి, హైదరాబాద్‌: ఒక వైపు ఐపీఎల్‌ సంబరం జరుగుతుండగా హైదరాబాద్ రంజీ జట్టులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రంజీ జట్టు మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ అశ్విన్ యాదవ్(33) శనివారం గుండెపోటుతో కన్ను మూశారు. అశ్విన్‌ అకాలమరణంపై పలువురు క్రికెట్‌ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. అశ్విన్‌కు భార్య, ముగ్గురు కుమారులున్నారు. 

అశ్విన్ యాదవ్ మరణ వార్త  తనను దిగ్భ్రాంతి గురి చేసిందని భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్  ట్వీట్‌  చేశారు.   సరదాగా ఉండే అశ్విన్‌ ఇక లేడంటే నమ్మలేకపోతున్నానంటూ  మాజీ రంజీ ఆఫ్ స్పిన్నర్, విశాల్ శర్మ సంతాపం తెలిపారు. అశ్విన్ టీమ్ మ్యాన్ అని ఎపుడు జట్టు విజయం కోసం ఆరాటపడేవాడని గుర్తు చేసుకున్నారు. స్థానిక మ్యాచ్‌లలో ఎస్‌బిహెచ్ తరఫున అశ్విన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హైదరాబాద్ మాజీ ఓపెనర్ డేనియల్ మనోహర్  మాట్లాడుతూ అశ్విన్‌ ఇంత చిన్న వయసులో మనకి దూరంకావడం విచారకరమన్నారు. ఫాస్ట్ బౌలర్‌గా టీమ్‌కు అండగా ఉండేవాడు. ఫిట్‌నెస్‌కు ప్రాణమిచ్చే అశ్విన్‌కు గుండెపోటు రావడం షాకింగ్‌ ఉందన్నారు.  అశ్విన్ తన ఆటతో ఎపుడూ ఆకట్టుకునేవాడని, చిన్న వయస్సు నుండే వికెట్లు తీసే సామర్ధ్యం కలిగి ఉన్నాడని ఆండ్రూస్ స్కూల్ కోచ్‌గా పనిచేసిన నోయెల్ కార్ సంతాపం తెలిపారు. 2002లో సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్ర అండర్ -14 జట్టుకు 25 వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడు నిలిచాడంటూ నివాళులర్పించారు.

కాగా కరియర్‌లో 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌ యాదవ్‌ 34 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలో 2007 లో మొహాలిలో పంజాబ్‌తో రంజీ ట్రోఫీకి అరంగేట్రం చేశాడు. 2008-09 సీజన్‌లో ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీపై 52 పరుగులకు 6 వికెట్లు తీశాడు. యాదవ్ చివరి సారిగా 2009లో ముంబైతో తన రంజీ మ్యాచ్ ఆడాడు.  రెండు టీ 20 మ్యాచ్‌లు కూడా ఆడాడు.

మరిన్ని వార్తలు