Tennis Tournament: ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రష్మిక; అడిలైడ్‌ టోర్నీతో సానియా సీజన్‌ షురూ 

22 Dec, 2022 08:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి శ్రీవల్లి రష్మిక ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. నవీ ముంబైలో బుధవారం జరిగిన సింగిల్స్‌ తొలి రౌండ్‌లో రష్మిక 6–0తో రియా భాటియా (భారత్‌)పై గెలిచింది. రష్మిక తొలి సెట్‌ గెలిచాక రియా గాయం కారణంగా వైదొలగడంతో రెండో సెట్‌ను నిర్వహించలేదు.

డబుల్స్‌ తొలి రౌండ్‌లో రష్మిక–వైదేహి (భారత్‌) జోడీ 4–6, 6–4, 10–8తో శ్రావ్య శివాని–జెన్నిఫర్‌ (భారత్‌) ద్వయంపై నెగ్గి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌కే చెందిన సౌజన్య బవిశెట్టి డబుల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి చేరింది. తొలి రౌండ్‌లో సౌజన్య–షర్మదా (భారత్‌) జోడీ 6–4, 7–6 (11/9)తో సహజ–సోహా (భారత్‌) జంటను ఓడించింది.  

అడిలైడ్‌ టోర్నీతో సానియా సీజన్‌ షురూ 
భారత మహిళా టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా 2023 సీజన్‌ను అడిలైడ్‌ ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ టోర్నీ ద్వారా ప్రారంభించనుంది. జనవరి 1 నుంచి 7 వరకు ఆస్ట్రేలియాలో జరిగే ఈ టోర్నీలో సానియా కజకిస్తాన్‌ ప్లేయర్‌ అన్నా డానిలినాతో కలిసి డబుల్స్‌ విభాగంలో బరిలోకి దిగనుంది.

ఈ మేరకు నిర్వాహకులు ఈ టోర్నీలో ఆడుతున్న క్రీడాకారిణుల జాబితాను విడుదల చేశారు. ఈ ఏడాది సానియా 16 టోర్నీలలో పోటీపడగా... రెండు టోర్నీలలో (చార్ల్స్‌టన్‌ ఓపెన్, స్ట్రాస్‌బర్గ్‌ ఓపెన్‌) రన్నరప్‌ ట్రోఫీతో సంతృప్తి పడింది. ఆమె 26 మ్యాచ్‌ల్లో గెలిచి, 16 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

చదవండి: ICC Test Rankings: అదరగొట్టిన అక్షర్‌ పటేల్‌... కుల్దీప్‌, పుజారా, గిల్‌ సైతం.. 
BCCI: మా వల్ల కాదు.. తప్పుకొనే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్‌! కిట్‌ స్పాన్సర్‌ కూడా! కారణం?

మరిన్ని వార్తలు