నగరానికి దక్కిన ‘భాగ్యం’

12 Feb, 2023 01:31 IST|Sakshi

సాక్షి క్రీడా విభాగం: అక్టోబర్‌ 7, 2022... హైదరాబాద్‌లో ఫార్ములా ‘ఇ’ రేస్‌ నిర్వహించబోతున్నట్లు తొలిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన రోజు... ఇప్పుడు సరిగ్గా నాలుగు నెలల తర్వాత వచ్చిన స్పందనను చూస్తే ఈ రేసింగ్‌ ఈవెంట్‌ ఎంతగా సక్సెస్‌ అయ్యిందో అర్థమవుతుంది. ఫార్ములా ‘ఇ’ పోటీలను నిర్వహించే అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సమాఖ్య (ఎఫ్‌ఐఏ) కూడా హైదరాబాద్‌ పోటీలపై తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

ఫార్ములా ‘ఇ’ చరిత్రలో అత్యుత్తమ రేస్‌లలో ఒకటిగా ప్రకటించింది. హైదరాబాద్‌లో ‘ఇ’ రేసు జరుగుతుందని ప్రకటించిన సమయంలో ఇది సఫలం కావడంపై అనేక సందేహాలు కనిపించాయి. నగరం నడిబొడ్డున ‘స్ట్రీట్‌ సర్క్యూట్‌’ ట్రాక్‌ను సిద్ధం చేయడం అన్నింటికంటే పెద్ద సవాల్‌గా నిలిచింది. అత్యంత వేగంగా ఈ పనులు పూర్తి చేసిన అధికారులు హుస్సేన్‌ సాగర్‌ తీరంలో ఎన్టీఆర్‌ గార్డెన్, ఐమ్యాక్స్‌ పరిసరాలను రేసింగ్‌ కార్లకు అనుగుణంగా మార్చారు.

అయితే గత నవంబర్‌లో దీనికి సన్నాహకంగా నిర్వహించిన ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌) ఆశించిన స్థాయిలో సఫలం కాలేదు. దానికి స్పందన గొప్పగా లేకపోగా, ఏర్పాట్లలో సాగిన లోపాలు, ట్రాక్‌పై డ్రైవర్ల అసంతృప్తి, రేస్‌ల వాయిదాలు వెరసి ప్రతికూల వ్యాఖ్యలు వినిపించాయి. దాంతో ఫార్ములా ‘ఇ’ నిర్వహణపై కూడా కొంత అపనమ్మకం వచ్చింది. అయితే ఎఫ్‌ఐఏ నేరుగా ట్రాక్‌ ఏర్పాటు అంశంలో భాగస్వామిగా మారి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేయించగలిగింది.

తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో కీలకంగా ఉన్న, ఫార్ములా ‘ఇ’ రేసింగ్‌లో జట్టు ఉన్న ‘మహీంద్రా’ కూడా సహభాగస్వామిగా భారత్‌లో తొలి రేసును విజయవంతం చేయడంలో చురుగ్గా పాల్గొంది. మరోవైపు ట్రాఫిక్‌ ఆంక్షలు, వాటిలో వచ్చిన ఇక్కట్లతో సామాన్యుల్లో తీవ్ర అసహనం కనిపించింది. శుక్రవారం ట్రాక్‌లోకి సాధారణ వాహనాలు దూసుకురావడం కూడా కొంత ఆందోళన రేపిన అంశం. అయితే సరైన సమయంలో స్పందించిన అధికారులు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల అసంతృప్తిని సాధ్యమైనంతగా తగ్గించే ప్రయత్నం చేశారు.

చివరకు అభిమానులు కూడా ఆసక్తిగా పెద్ద ఎత్తున హాజరు కావడం, తమ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ ఈవెంట్‌గా దానికి తగిన విలువ ఇవ్వడంతో ఇది సక్సెస్‌గా నిలవగలిగింది. భారత్‌లో ఢిల్లీ, ముంబైలాంటి నగరాలను కాదని హైదరాబాద్‌లో జరిగిన ‘ఇ’ రేసింగ్‌కు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరు కావడం కూడా దీనికి గల స్థాయిని చూపించింది. మొత్తంగా ఎఫ్‌ఐఏ కూడా సౌకర్యాలు, ఏర్పాట్ల విషయంలో ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం ఫార్ములా ‘ఇ’ రేసింగ్‌కు సంబంధించి పెద్ద సానుకూలాంశం. తాజా సీజన్‌లో ప్రపంచవ్యాప్తంగా మరో 12 రేస్‌లు మిగిలి ఉన్నాయి. వచ్చే ఏడాది వేదికపై ఇంకా స్పష్టత లేకున్నా... వచ్చే సీజన్‌లో కూడా హైదరాబాద్‌ మళ్లీ ఆతిథ్యం ఇవ్వడం పాటు శాశ్వత వేదికగా కూడా మారే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు