వారి ప్రేమే నన్ను కట్టి పడేసింది: కోహ్లి

4 Sep, 2020 16:43 IST|Sakshi

ఆర్సీబీని వదిలే ప్రసక్తే లేదు

ఎప్పుడూ అలా ఆలోచించలేదు

దుబాయ్‌: ఎట్టి పరిస్థితుల్లోనూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టును వీడే ప్రసక్తే లేదని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు.  కనీసం ఆర్సీబీ ఫ్రాంచైజీని వదిలేయాలని ఆలోచన ఏనాడు రాలేదన్నాడు. ఇందుకు ఆర్సీబీ యాజమాన్యం చూపెట్టే ప్రేమే కారణమన్నాడు. ఎంతో కేరింగ్‌గా ఉండే ఆర్సీబీ యాజమాన్యాన్ని విడిచిపెట్టాలని ఎప్పుడూ అనుకోనన్నాడు. త్వరలో జరుగనున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని కోహ్లి పేర్కొన్నాడు. ఐపీఎల్‌కు మరికొద్ది రోజులే ఉన్నందున ప్రాక్టీస్‌లో నిమగ్నమైన కోహ్లి..  కాస్త ఎమోషనల్‌గా మాట్లాడాడు. (చదవండి: ఈసాల కప్ నమ్దే అంటావ్‌..)

‘నాకు ఆర్సీబీ అంటే ఇష్టం. ఆ ఫ్రాంచైజీ ఎంతో ప్రేమను చూపిస్తుంది. దాంతో ఆర్సీబీతోనే ఉంటూ వస్తున్నా. భవిష్యత్తులో కూడా ఆర్సీబీని విడిచిపెట్టకూడదనే అనుకుంటున్నా. నేను ఐపీఎల్‌ ఆడుతున్నంత వరకూ ఆర్సీబీతోనే కొనసాగుతా’ అని తెలిపాడు. ‘దాదాపు ఐదు నెలల క్రితం నెట్‌ ప్రాక్టీస్‌ చేశాం. దక్షిణాఫ్రికాతో ధర్మశాలలో మ్యాచ్‌ కోసం చివరిసారి ప్రాక్టీస్‌ చేశాం. కానీ మ్యాచ్‌ ఆడలేదు. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయ్యింది. ఇక లక్నోలో జరగాల్సిన వన్డే నాటికి పరిస్థితి మారిపోయింది. కానీ పరిస్థితులు అలా వచ్చినందుకు నేనేమీ ఫీల్‌ కాలేదు. సుదీర్ఘం విరామం తర్వాత ప్రాక్టీస్‌ చేయడంతో కాస్త ఇబ్బందులు ఉంటాయి. ఈ సీజన్‌ ఐపీఎల్‌ కోసం సిద్ధంగా ఉన్నాం’ అని కోహ్లి తెలిపాడు.

2008లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌కు సచిన్‌, సెహ్వాగ్‌ గాయాల కారణంగా దూరమవడంతో కోహ్లికి అనూహ్యంగా పిలుపు వచ్చింది. కానీ ఆ మ్యాచ్‌లో కోహ్లి విఫలమయ్యాడు. గంభీర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ 12 పరుగులే చేసి ఔటయ్యాడు. కాకపోతే ఆ సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో కోహ్లి అర్ధ శతకంతో టోర్నీ భారత్‌ సొంతమైంది. అంతకుముందు 2008 అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టుకు కెప్టెన్సీ వహించిన కోహ్లి ఆ ఏడాది భారత్‌ను చాంపియన్‌గా నిలిచాడు. దీంతో కోహ్లి రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయాడు. ఆ వెంటనే ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ నుంచి పిలుపొచ్చింది.  ​కాగా, 2011లో ఆర్సీబీ కెప్టెన్‌ అయిన కోహ్లి.. ఇప్పటివరకూ జట్టుకు సారథిగానే కొనసాగుతున్నాడు. ఇప్పటివరకూ ఆర్సీబీ కప్‌ కొట్టకపోయినా కోహ్లి కెప్టెన్సీ మార్చాలన్న ఆలోచనను సదరు ఫ్రాంచైజీ చేయలేదు. కోహ్లిపై నమ్మకం ఉంచి కెప్టెన్‌గా కొనసాగిస్తూనే వస్తోంది. దాదాపు 10 ఏళ్ల కాలంలో జట్టును ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్‌పై ఆర్సీబీ ఇంకా నమ్మకం ఉంచడమే కోహ్లిని కట్టిపడేయడానికి ప్రధాన కారణం కావొచ్చు.(చదవండి: సీఎస్‌కేకు మరో ఎదురుదెబ్బ!)

మరిన్ని వార్తలు