Parthiv Patel: 'అశ్విన్‌కు టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవచ్చు'

31 Jul, 2022 13:30 IST|Sakshi

వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో అశ్విన్‌ తన వంతు పాత్ర పోషించాడు. ఇక అశ్విన్‌ దాదాపు 8 నెలల తర్వాత తిరిగి భారత టీ20 జట్టులో ఎంట్రీ ఇచ్చాడు.

అతడు చివరగా నవంబర్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. కాగా విండీస్‌తో తొలి టీ20లో భారత్‌ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ క్రమంలో అనూహ్యంగా అశ్విన్‌కు జట్టులో చోటు దక్కిది. ఇక మిగితా ఇద్దరు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్ కూడా భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.

అయితే సోమవారం జరగనున్న రెండో టీ20లో కూడా ముగ్గురు స్పిన్నర్లకు భారత్‌ అవకాశం ఇస్తుందో లేదో వేచి చూడాలి. ఈ క్రమంలో భారత్‌ మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్ పటేల్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రెండో టీ20లో భారత ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే అశ్విన్‌ తన స్థానం కోల్పోతాడని  పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కూడా అశ్విన్‌కు చోటు దక్కే అవకాశం లేదని పార్థివ్ తెలిపాడు.

"భారత తమ తదుపరి మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలనుకుంటే అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కదు. అతడు టీమిండియా టీ20 ప్రపచంకప్‌ ప్రణాళికలలో లేనట్లు కన్పిస్తోంది. ప్రపంచకప్‌ భారత జట్టులో కుల్దీప్ యాదవ్, బిష్ణోయ్,యుజ్వేంద్ర చాహల్‌ వంటి స్పిన్నర్లు ఉండాలని నేను భావిస్తున్నాను. ఈ మణికట్టు స్పిన్నర్లుకు మ్యాచ్‌ మధ్యలో వికెట్లు పడగొట్టి మలుపు తిప్పగలిగే సత్తా ఉంది. అశ్విన్‌ మాత్రం టీ20ల్లో అంతగా రాణించలేడు" అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు.

ఇక తొలి టీ20లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మను పార్థివ్ పటేల్‌ ప్రశంసించాడు. "స్వదేశంలో కూడా భారత్‌ టీ20‍ల్లో ముగ్గురు  స్పిన్నర్లతో ఆడటం నేను ఇప్పటివరకు చూడలేదు. విండీస్‌ పర్యటనలో భారత్‌ అద్భుతంగా ఆడుతోంది. ప్రతీ మ్యాచ్‌లోను భారత్‌ తమ వ్యూహాలను రచిస్తోంది. తొలి టీ20లో స్పిన్నర్లను రోహిత్‌ సరైన సమయాల్లో ఊపయగించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రవి బిష్ణోయ్‌తో నాలుగు ఓవర్లు వేయించడం సాహసోపేత నిర్ణయం" అని పార్థివ్ తెలిపాడు.
చదవండి: ZIM vs IND: జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు అతడిని ఎందుకు ఎంపిక చేశారు..?

మరిన్ని వార్తలు