‘సురేశ్‌ రైనా కెరీర్‌ ముగిసినట్లే’

27 Jul, 2020 15:19 IST|Sakshi
సురేశ్‌ రైనా(ఫైల్‌ఫొటో)

సిడ్నీ: భారత క్రికెట్‌ జట్టులో రీఎంట్రీపై వెటరన్‌ సురేశ్‌ రైనా ఏమైనా ఆశలు పెట్టుకుంటే వాటిని వదులుకోవాల్సిందేనని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌. ఇక భారత జట్టులో రైనా పునరాగమనం చేసే అవకాశమే లేదంటూ జోస్యం చెప్పాడు. ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. యువ క్రికెటర్ల వైపే ఎక్కువ మొగ్గుచూపుతుండటంతో రైనాకు చాన్స్‌ ఉండదన్నాడు. సాధారణంగా రైనా నాల్గో స్థానంలో బ్యాటింగ్‌ చేసేవాడని, ఇప్పుడు ఆ స్థానాన్ని శ్రేయస్‌ అయ్యర్‌ సమర్థవంతంగా భర్తీ చేస్తున్నాడన్నాడు. మరి ఇటువంటి తరుణంలో రైనా తన స్థానంపై ఆశలు పెట్టుకోవడం అనవసరమన్నాడు. (ఐసీసీ వన్డే సూపర్‌ లీగ్‌ వచ్చేసింది..)

ఒకవేళ టీ20 ఫార్మాట్‌లో రైనా చాన్స్‌ కోసం యత్నిస్తే అప్పుడు శిఖర్‌ ధావన్‌ను రిజర్వ్‌ బెంచ్‌లో ఉండాల్సి ఉంటుందన్నాడు. ఇక్కడ కూడా రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లు ఓపెనింగ్‌ చేసి, ధావన్‌ జట్టులో లేని పక్షంలోనే రైనాకు  అవకాశం వచ్చే చాన్స్‌ ఉంటుందన్నాడు. అది జరగడం అనేది ప‍్రస్తుతం పరిస్థితుల్లో లేదని హాగ్‌ అభిప్రాయపడ్డాడు. ఏ రకంగా చూసుకున్నా రైనా తిరిగి భారత జట్టులోకి వచ్చేందకు దారులు మూసుకుపోయాయని తన యూట్యూబ్‌ చానల్‌లో మాట్లాడిన హాగ్‌ స్పష్టం చేశాడు.

ఇదిలా ఉంచితే, తన రీఎంట్రీపై రైనా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తన పునరాగమనం తప్పనిసరిగా ఉంటుందనే ఇటీవలే ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున ఆడే రైనా.. ఆ లీగ్‌లో సత్తాచాటితే భారత జట్టులో చాన్స్‌ను పట్టేయవచ్చనే ఆశతో ఉన్నాడు. తాను టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలనే ఆశలు ఐపీఎల్‌పైనే ఆధారపడి ఉన్నాయన్న రైనా.. తనకు ఇంకా రెండు-మూడేళ్ల క్రికెట్‌ మిగిలే ఉందన్నాడు. రెండు టీ20 వరల్డ్‌కప్‌ల్లో తాను ఆడతానని చెప్పుకొచ్చిన రైనా.. తన టీ20 క్రికెట్‌ ఎంతో మెరుగ్గా ఉందన్నాడు. ఇప్పటివరకూ భారత్‌ తరఫున 226 వన్డేలు ఆడిన రైనా, 78 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2018 జూలై నుంచి రైనా తిరిగి అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్‌ ఆడలేదు.(బీసీసీఐ తీరు దారుణం: యువరాజ్‌)

మరిన్ని వార్తలు