Vinod Kambli: ఏదైనా పని ఉంటే ఇప్పించండి.. చాలీచాలని జీతంతో బ్రతుకీడుస్తున్నా..!

17 Aug, 2022 14:06 IST|Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌, క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ సహచరుడు, ప్రపంచ క్రికెట్‌లో బ్రియాన్‌ లారా తర్వాత అంతటి సొగసరి బ్యాటర్‌గా గుర్తింపు పొందిన ముంబై మాజీ ఆటగాడు వినోద్‌ కాంబ్లీ ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాడో ఎవరైనా ఊహించగలరా..? అంతటి స్టార్‌ ఇమేజ్‌ కలిగిన క్రికెటర్‌ ప్రస్తుతం చాలీచాలని జీతంతో బతుకీడుస్తున్నాడంటే ఎవరైనా నమ్మగలరా..? కానీ ఇది నిజం.


ప్రపంచ క్రికెట్‌లో 90వ దశకంలో ఓ వెలుగు వెలిగిన కాంబ్లీ రకరకాల కారణాల చేత ఆర్ధిక కష్టాల్లో కూరుకుపోయి ప్రస్తుతం పూట గడవని దీనావస్థలో ఉన్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా మీడియాతో పంచుకున్నాడు. క్రికెట్‌కు సంబంధించి ఏదైనా పని ఉంటే ఇప్పించాలని బీసీసీఐని వేడుకుంటున్నాడు. బీసీసీఐ ఇస్తున్న ముప్సై వేల పెన్షనే తనను తన కుటుంబాన్ని బతికిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. 

కొద్దిరోజుల క్రితం వరకు నేరుల్‌లో 'టెండుల్కర్ మిడిల్ సెక్స్ గ్లోబల్ అకాడమీ'లో యువ క్రికెటర్లకు మెంటార్‌గా పని చేసేవాడినని.. అయితే, నేరుల్ తను నివసించే ప్రాంతానికి చాలా దూరంగా ఉండటంతో సగం రోజు ప్రయాణానానికే సరిపోతుందని.. అందుకే తప్పని పరిస్థితుల్లో ఆ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చిందని వాపోయాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) చొరవ తీసుకుని వాంఖడే లేదా బీకేసీ స్టేడియంలో ఏదైనా క్రికెట్‌కు సం‍బంధించిన పని ఇప్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటానని అభ్యర్ధించాడు. పెన్షన్ ఇచ్చి తనను, తన కుటుంబాన్ని పోషిస్తున్న బీసీసీఐకి జీవితకాలం రుణపడి ఉంటానని అన్నాడు. 

తన ఆర్థిక కష్టాల గురించి చిన్ననాటి స్నేహితుడు సచిన్‌కు తెలుసా..? అని ప్రశ్నించగా.. అతనికి తెలుసని సమాధానమిచ్చాడు. అయితే, సచిన్‌ నుంచి తాను ఏమీ ఆశించడం లేదని.. 'టెండుల్కర్ మిడిల్ సెక్స్ గ్లోబల్ అకాడమీ'లో ఉద్యోగం ఇప్పించింది సచినేనని తెలిపాడు. సచిన్‌ ఇప్పటికే తనకెంతో చేశాడని.. అతనో గొప్ప స్నేహితుడని.. తన బాగు కోరే వారిలో సచిన్‌ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడని చెప్పుకొచ్చాడు.

టీమిండియా తరఫున 17 టెస్ట్‌లు, 104 వన్డేలు ఆడిన కాంబ్లీ 3500కు పైగా పరుగులు చేశాడు. వన్డేల్లో 2 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలు చేసిన కాంబ్లీ ఖాతాలో 4 టెస్ట్‌ సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్‌ల్లో కాంబ్లీ వరుసగా రెండు డబుల్‌ సెంచరీలు బాది అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాడు. టీమిండియా 1996 వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌లో లంక చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంటున్న సమయంలో కాంబ్లీ కన్నీరు పెట్టడం సగటు భారత అభిమానిని బాగా కదిలించింది.
చదవండి: ధవన్‌ను ఇంతలా అవమానించడం సరికాదు.. వేరేవాళ్లయ్యుంటే రచ్చరచ్చ జరిగేది..!

మరిన్ని వార్తలు