Rishabh Pant: 'ఆడకపోయినా పర్లేదు.. పక్కన కూర్చుంటే చాలు'

20 Jan, 2023 20:08 IST|Sakshi

టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ గతేడాది డిసెంబర్‌ 30న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కారు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో పంత్‌ ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.పంత్‌ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు ఇప్పటికే పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా పంత్‌ దూరమయ్యాడు.

ఇకపోతే పంత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పంత్‌ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎవరు నడిపించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే డేవిడ్‌ వార్నర్‌కు పగ్గాలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ విషయం పక్కనబెడితే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌కోచ్‌ రికీ పాంటింగ్‌ రిషబ్‌ పంత్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్‌ ఈసారి ఐపీఎల్‌ ఆడకపోయినా పర్లేదు.. కానీ డగౌట్‌లో నా పక్కన కూర్చుంటే చాలని పేర్కొన్నాడు.

ట్విటర్‌లో బుమ్రా భార్య.. ప్రెజంటేటర్‌ సంజనా గణేషన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పాంటింగ్‌ మాట్లాడాడు. ''అలాంటి వ్యక్తులను భర్తీ చేయలేం. అంతే. అలాంటి ప్లేయర్స్ చెట్లపై పెరగరు. టీమ్ లో పంత్ స్థానంలో వచ్చే వికెట్ కీపర్ బ్యాటర్ కోసం మేము వెతకాలి. అతను ఆడటానికి ఫిట్ గా లేకపోయినా కూడా పంత్ మాతో ఉండాలని కోరుకుంటున్నాం. పంత్ ఓ కెప్టెన్ గానే కాదు.. అందరికీ వ్యాపించే అతని నవ్వు మాకు బాగా నచ్చుతుంది.

ఒకవేళ అతడు ప్రయాణాలకు సిద్ధంగా ఉంటే, టీమ్ తో పాటు రాగలిగితే.. అతడు నాతోపాటు డగౌట్ లో కూర్చోవాలని కోరుకుంటున్నాను. మార్చి నెలలో మేము క్యాంప్ ఏర్పాటు చేయబోతున్నాం. అప్పటిలోగా అతడు రాగలిగితే టీమ్ తోపాటు ఉండాల్సిందిగా కోరుకుంటున్నా. పంత్ అంటే నాకు చాలా ఇష్టం.  అతను త్వరగా కోలుకోవాలని మళ్లీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా'' అంటూ ముగించాడు.

చదవండి: ధోని కొత్త లుక్‌ అదుర్స్‌.. ఫోటో వైరల్‌

U-19 Womens T20 WC: రూల్స్‌ భ్రష్టు పట్టించారు.. క్రీడాస్పూర్తికి విరుద్ధం

మరిన్ని వార్తలు