లంక పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇస్తాను..

11 Jun, 2021 18:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ఓ సిరీస్‌కు ఎంపికై ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండా బెంచ్‌కే పరిమితమైతే, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసని టీమిండియా దిగ్గజ క్రికెటర్, భారత బి జట్టు ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తెలిపాడు. చిన్నప్పుడు తనకు అలాంటి అనుభవాలు చాలా ఎదురయ్యాయని, అందుకే తాను భారత్‌-ఏ, అండర్-19 కోచ్‌గా వ్యవహరించినప్పుడు అందరికీ అవకాశాలు ఇచ్చేవాడినని గుర్తు చేసుకున్నాడు. గతంలో తాను పాటించిన సిద్ధాంతాన్నే రాబోయే శ్రీలంక పర్యటనలోనూ అమలు చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు. కాగా, వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించే భారత బి జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. 

తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో ద్రవిడ్‌ మాట్లాడుతూ.. గతంలో తాను కోచ్‌గా పని చేసిన కాలంలో యువ ఆటగాళ్లకు సమాన అవకాశాలు కల్పించేవాడినని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఆటగాళ్లందరికీ ముందే చెప్పేవాడినని, ఇలా చేయడం వల్ల సత్ఫలితాలు కూడా రాబట్టానని చెప్పుకొచ్చాడు. జాతీయ జట్టులో స్థానం దక్కినప్పుడు యువ ఆటగాళ్లు తెగ సంబర పడిపోతారని, అలాంటప్పుడు వారికి నిరూపించుకునే అవకాశం రాకపోతే అంతే కుమిలి పోతారని అన్నాడు. అందుకే తాను అండర్‌-19 జట్టులో ప్రతి మ్యాచ్‌కు ఐదారు మార్పులు చేసేవాడినని వెల్లడించాడు. కాగా, శ్రీలంక పర్యటనలో శిఖర్ ధవన్ నేతృత్వంలోని యువ భారత్‌.. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే జులై 13న  జరుగనుండగా..జూన్‌ 16న రెండో వన్డే, 18న మూడో వన్డే‌ జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.

భారత జట్టు: శిఖర్‌ ధవన్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్ (వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్‌, హార్దిక్ పాండ్యా, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్, మనీష్‌ పాండే, నితీష్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌, సంజు శాంసన్‌, యుజ్వేంద్ర చహల్‌, రాహుల్‌ చాహర్‌, కృష్ణప్ప గౌతమ్‌, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, దీపక్‌ చహర్‌, నవ్‌దీప్‌ సైనీ, చేతన్‌ సకారియా. 
చదవండి: నట్టూ, శ్రేయస్‌లను ఎంపిక చేయకపోవడానికి కారణం అదేనా..
 

మరిన్ని వార్తలు