నేను అసలు ఊహించలేదు: హార్దిక్‌

8 Dec, 2020 20:22 IST|Sakshi

సిడ్నీ: టీమిండియాతో జరిగిన చివరిదైన మూడో టీ20లో ఆసీస్‌ 12 పరుగుల తేడాతో గెలిచింది. తొలి రెండు టీ20లను టీమిండియా గెలిచి సిరీస్‌ను సాధిస్తే, మూడో టీ20లో మాత్రం ఆసీస్‌ గెలుపును అందుకుంది. దాంతో ఆసీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలనుకున్న టీమిండియా ఆశలు తీరలేదు.  ఈ మ్యాచ్‌లో రాణించిన ఆసీస్‌ స్పిన్నర్‌ స్వెప్సన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. మూడు వికెట్లు సాధించడమే కాకుండా 23 పరుగులు మాత్రమే ఇచ్చాడు.  కాగా, ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌ అవార్డు మాత్రం టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు దక్కింది. దీనిపై అవార్డుల కార్యక్రమంలో పాండ్యా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.  ‘ మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ దక్కడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఆ అవార్డు దక్కుతుందని అసలు ఊహించలేదు. జట్టుగా సమష్టిగా రాణించడంతోనే ఆసీస్‌పై సిరీస్‌ సాధించాం. రెండో వన్డేలో ఓటమి తర్వాత ఒకటే అనుకున్నాం. ఇది నాలుగు మ్యాచ్‌ సిరీస్‌గానే భావించాం(చివరి వన్డే, మూడు టీ20లు). ఫలితంగా వరుసగా మూడు విజయాలు సాధించాం. ఇది మా జట్టులో సంతోషాన్ని తీసుకొచ్చింది.  సిరీస్‌ ఆరంభమైన తర్వాత నాకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని అనిపించలేదు. (ఆకట్టుకున్న కోహ్లి.. పోరాడి ఓడిన టీమిండియా)

గెలిస్తేనే ఇంటర్వ్యూలు ఇవ్వడానికి అర్హులం అని అనుకున్నా.  నేను నాలుగు నెలలుగా నా బిడ్డను చూడలేదు. ఇక కుటుంబంతో కలిసి సమయాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా’ అని హార్దిక్‌ తెలిపాడు. కేవలం ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు మాత్రమే ఎంపికైన హార్దిక్‌.. స్వదేశానికి బయల్దేరనున్నాడు. గతేడాది వెన్నుగాయం కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్న హార్దిక్‌ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ను సాధించలేదు. ఈ సిరీస్‌లో అడపా దడపా బౌలింగ్‌ వేసిన హార్దిక్‌కు తగినంత విశ్రాంతి ఇవ్వాలనే యోచనలో ఉన్న బీసీసీఐ.. అతనికి టెస్టుల్లో ఎంపిక చేయలేదు. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకునే హార్దిక్‌కు విశ్రాంతి ఇవ్వడం జరిగింది. ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా చివరివరకు పోరాడి ఓడిపోయింది.187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 20 ఓవర్లలో 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 85 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాట్స్‌మన్‌ ఎవరు చెప్పుకోదగిన విధంగా ఆడలేకపోయారు.(కోహ్లి ఆలస్యం చేశావు.. వెంటనే రివ్యూ కోరుంటే)

>
మరిన్ని వార్తలు