రసెల్‌కు బౌలింగ్‌ చేయనే చేయను..

8 Sep, 2020 17:16 IST|Sakshi

దుబాయ్‌ : కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ రసెల్‌కు బౌలింగ్‌ చేయడం ఇష్టం లేదంటూ ఆల్‌రౌండర్‌ సిద్దేశ్‌ లాడ్‌ కుండబద్దలు కొట్టాడు. రసెల్‌కు బౌలింగ్‌ వేయడం కంటే బుమ్రా బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేయడానికి ఇష్టపడతా అంటూ తెలిపాడు. వాస్తవానికి రసెల్‌ ఉన్న కేకేఆర్‌ జట్టులోనే సిద్ధేశ్‌ లాడ్‌ ఉండడం గమనార్హం. ఇద్దరు ఓకే జట్టులో ఉండడంతో 2020 ఐపీఎల్‌లో రసెల్‌కు బౌలింగ్‌ వేసే అవకాశం సిద్దేశ్‌కు రాదు. కానీ మ్యాచ్‌లకు ముందు కేకేఆర్‌ ప్రాక్టీస్‌ సమయంలో తమ రిజర్వ్‌ బౌలర్లతోనే నెట్స్‌లో బంతులు వేయించుకొని ప్రాక్టీస్‌ చేస్తుంటారు. ఒకవేళ రసెల్‌కు బౌలింగే చేయాల్సి వస్తే తాను అతనికి బౌలింగ్‌ వేయడానికి ఇష్టపడను.. అంతేకాదు ఇతర పరిష్కార మార్గాలు కూడా వెతుక్కుంటానంటూ సిద్ధేశ్‌ తెలిపాడు. (చదవండి : ఆరు బంతులు.. ఆరు రకాలుగా)

'ఎందుకో నాకు రసెల్‌ను చూస్తే బౌలింగ్‌ వేయాలనిపించదు. అతను బంతులను బలంగా బాదుతూ తన విధ్వంసకర ఆటను కొనసాగిస్తాడు. నేను ముంబై ఇండియన్స్‌ జట్టుతో ఉన్నప్పుడు రసెల్‌ ఆటను గమనించాను. ప్రత్యర్థిగా ఎన్నోసార్లు విధ్వంసాన్ని దగ్గరుండి చూశాను. ఇప్పటివరకు నేను రసెల్‌కు బౌలింగ్‌ చేయలేదు.. ఇప్పుడు ఒకే జట్టులో ఉన్నాం కాబట్టి నెట్స్‌లోనూ అతనికి బౌలింగ్‌ చేయాలనుకోవడం లేదు.' అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి : పంత్‌.. సిక్సర్ల మోత!)

ఇక గతేడాది 2019 ఐపీఎల్‌లో కోల్‌కతా తరపున రసెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. పరాజయం అంచున నిలిచిన ప్రతీసారి తన విధ్వంసకర ఆటతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ సీజన్‌లో 204.81 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్థసెంచరీలు ఉన్నాయి. ఐదు లేదా ఆరు స్థానాల్లో వచ్చే రసెల్‌ను ఈసారి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు పంపాలని జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయించిందని ఆ జట్టు ప్రధాన కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌, మెంటార్‌ డేవిడ్‌ హస్సీలు తెలిపారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో రసెల్‌ను ముందు పంపితే టీ20 డబుల్‌ సెంచరీ చేసే సత్తా రసెల్‌కు ఉందంటూ డేవిడ్‌ హస్సీ అభిప్రాయపడ్డాడు. గౌతం గంభీర్‌ నేతృత్వంలో 2012, 2014లో  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు రెండుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గింది. గంభీర్‌ తర్వాత కోల్‌కతా కెప్టెన్‌గా ఎంపికయిన దినేష్‌ కార్తిక్‌ సారధ్యంలో 2018లో ఫ్లే ఆఫ్స్‌, 2019లో లీగ్‌ స్టేజీలోనే వెనుదిరిగింది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు