2023-2027 సీజన్‌ ఎఫ్‌టీపీని ప్రకటించిన ఐసీసీ

17 Aug, 2022 14:37 IST|Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) పురుషుల  క్రికెట్‌కు సంబంధించిన ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌టీపీ)ని బుధవారం విడుదల చేసింది. 2023 నుంచి 2027 వరకు ఐదేళ్ల కాలానికి గాను పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు 2023 వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు టీ20 వరల్డ్‌ కప్స్‌, రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఎడిషన్‌లు ఉన్నాయి. 2019-23 ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌తో పోలిస్తే రాబోయే సీజన్‌లో మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది. 2023-27 ఎఫ్‌టీపీలో మొత్తం 777 మ్యాచ్‌లు జరుగనున్నాయి. వీటిలో 173 టెస్టులు, 281 వన్డేలు, 323 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ ఎఫ్‌టీపీ ఐసీసీ సభ్యత్వం ఉన్న 12 దేశాలకు మాత్రమే వర్తిస్తుంది.

ఇక, భారత జట్టు విషయానికొస్తే టీమిండియా 38 టెస్టులు, 42 వన్డేలు, 61 టి20 మ్యాచ్‌లతో కలిపి మొత్తం 141 మ్యాచ్‌ల్లో పోటీపడనుంది. అయితే ఈ ఐదేళ్లలో భారత్, పాకిస్తాన్‌ మధ్య ఒక్క ద్వైపాక్షిక సిరీస్‌ లేకపోవడం గమనార్హం. ఈ రెండు జట్లు ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడతాయి. అలాగే భారత్‌.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లు ఆడుతుంది. ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ ఆడేది. 1991 తర్వాత మళ్లీ ఆస్ట్రేలియాతో భారత్‌ ఐదు టెస్టుల సిరీస్‌ ఆడటం ఇదే మొదటిసారి.
చదవండి'రోహిత్‌ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్‌ అతడే'

మరిన్ని వార్తలు