ICC: 'క్షమించండి'.. ఇలా అయితే ఎలా పెద్దన్న!

16 Feb, 2023 19:50 IST|Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) క్రికెట్‌లో పెద్దన్న పాత్ర పోషిస్తుందంటారు. అలాంటి ఐసీసీ గురువారం క్రికెట్‌ అభిమానులను క్షమాపణ కోరింది. కారణం ఏంటనేది ఈ పాటికే మీకందరికి అర్థమయ్యే ఉంటుంది. పెద్దన్న(ఐసీసీ) బుధవారం ర్యాంకింగ్స్‌లో చిన్న తప్పిదం చేసింది. బుధవారం మధ్యాహ్నం టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచిదంటూ ఐసీసీ ట్వీట్‌ చేసింది. భారత్‌ ఖాతాలో 115 పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా 111 పాయింట్లతో ఉందని పేర్కొంది. దీంతో టీమిండియా మూడు ఫార్మాట్లలోనూ నెంబర్‌వన్‌గా అవతరించడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

అయితే దాదాపు ఏడు గంటల తర్వాత ఐసీసీ తప్పిదాన్ని గుర్తించింది. భారత్‌ ఇంకా టాప్‌ ర్యాంక్‌కు చేరుకోలేదని... రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతోందని... తమ రేటింగ్‌ పాయింట్ల లెక్కల్లో తప్పిదంతో ఈ గందరగోళం చోటు చేసుకుందని బుధవారం రాత్రి ఐసీసీ వివరణ ఇచ్చుకుంది. ప్రస్తుత టెస్టు ర్యాంకింగ్స్‌ లో ఆ్రస్టేలియా 126 రేటింగ్‌తో టాప్‌ ర్యాంక్‌లో, భారత్‌ 115 రేటింగ్‌తో రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. తాజాగా గురువారం తమ తప్పిదానికి క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఐసీసీ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నిజానికి తొలి టెస్టుకు ముందు టీమిండియా 111 పాయింట్లతో రెండో స్థానంలో.. 126 పాయింట్లతో ఆసీస్‌ తొలిస్థానంలో ఉన్నాయి. తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌ టేబుల్‌ను అప్‌డేట్‌ చేసింది. మ్యాచ్‌ గెలిచిన భారత్‌కు నాలుగు పాయింట్లు రాగా.. ఆసీస్‌కు ఎలాంటి పాయింట్లు రాలేదు. అయితే ఐసీసీ పొరపాటున టీమిండియా 115 పాయింట్లను టాప్‌గా పరిగణించి.. ఆస్ట్రేలియాకు 111 పాయింట్లు అంటూ చూపించింది. దీంతో టీమిండియా నెంబర్‌వన్‌ అని ప్రకటించింది. 

ఇక ఐసీసీ ర్యాంకింగ్స్‌ విషయంలో పొరపాటు చేయడం ఇది తొలిసారి కాదు. ఇంతకముందు ఇదే ఏడాది జనవరి 17న టీమిండియా టెస్టుల్లో నెంబర్‌వన్‌ ర్యాంక్‌ సాధించిందంటూ ఐసీసీ ట్వీట్‌ చేసింది. సాంకేతిక లోపం కారణంగా 126 పాయింట్లతో నెంబర్‌వన్‌గా ఉ‍న్న ఆస్ట్రేలియా జట్టుకు 15 పాయింట్లు కోత పడడంతో వారి రేటింగ్‌ 111కు పడిపోయింది. దీంతో 115 పాయింట్లతో టీమిండియా నెంబర్‌వన్‌ అయినట్లు తెలిపింది. అయితే రెండు గంటల వ్యవధిలోనే తప్పిదాన్ని గుర్తించిన ఐసీసీ లెక్క సరిచేసింది. అయితే ఈ ఏడాదిలో నెల వ్యవధిలో ఐసీసీ రెండుసార్లు పొరపాటు చేయడంపై క్రికెట్‌ అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు.

''క్రికెట్‌లో పెద్దన్న పాత్ర పోషిస్తావు.. ఇలా అయితే ఎలా''.. ''తప్పు చేస్తే దండిచాల్సిన నువ్వే పొరపాటు చేస్తే ఎలా పెద్దన్న''.. అంటూ కామెంట్స్‌ చేశారు. ఇక బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియాలు ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17న రెండో టెస్టు ఆడనున్నాయి. టీమిండియా ఐసీసీ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడాలంటే ఆసీస్‌తో మిగిలిన మూడు టెస్టుల్లో రెండు గెలిస్తే సరిపోతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక జూన్‌ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగనుంది.

చదవండి: భారత్‌ నంబర్‌వన్‌... కాదు కాదు నంబర్‌ 2

'ఆరడుగుల బౌలర్‌ కరువయ్యాడు'.. ద్రవిడ్‌ అదిరిపోయే కౌంటర్‌

మరిన్ని వార్తలు