IND VS ENG: టీమిండియా కెప్టెన్‌ ఎవరని ప్రశ్నించిన ఐసీసీ.. హర్భజన్‌ ఏమన్నాడంటే..?

28 Jun, 2022 20:14 IST|Sakshi

రోహిత్‌ శర్మ కోవిడ్‌ బారిన పడిన నేపథ్యంలో ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియాకు కెప్టెన్సీ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ మరో రెండు రోజుల్లో ప్రారంభంకావాల్సి ఉండగా.. రోహిత్‌ అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంపై బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. దీంతో ఐసీసీ జోక్యం చేసుకుంది. రోహిత్‌ అందుబాటులో ఉండకపోతే జులై 1 నుంచి ప్రారంభంకాబోయే టెస్ట్‌ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్‌ ఎవరని ప్రశ్నించింది. 

ఐసీసీ సంధించిన ఈ ప్రశ్నకు టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తనదైన స్టైల్లో ఒక్క మాటలో సమాధానం చెప్పాడు. భారత పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా పేరును ట్యాగ్‌ చేస్తూ ఐసీసీ ట్వీట్‌కు బదులిచ్చాడు. రోహిత్‌ గైర్హాజరీలో బుమ్రాకు టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పాలని సూచించాడు. భజ్జీ ఐసీసీకి రిప్లై ఇచ్చిన తీరు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే, రోహిత్‌కు బ్యాకప్‌గా మయాంక్‌ అగర్వాల్‌ను పిలిపించుకున్న బీసీసీఐ.. కెప్టెన్‌ ఎవరనే విషయం ఇంకా తేల్చలేదు. నెట్టింట మాత్రం రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. కొందరు పంత్‌ పేరు చెబుతుంటే మరికొందరు బుమ్రా, అశ్విన్‌ల పేర్లను ప్రతిపాదిస్తున్నారు.
చదవండి: రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌

మరిన్ని వార్తలు