ICC auction: అసంబద్ధ వేలంలో పాల్గొనలేం

15 Aug, 2022 04:52 IST|Sakshi

ఐసీసీకి భారత బ్రాడ్‌ కాస్టర్ల లేఖ  

ముంబై: భారత్‌లో ఐసీసీ టోర్నమెంట్ల ప్రసార హక్కుల కోసం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఎలక్ట్రానిక్‌ వేలం (ఇ–వేలం) నిర్వహించేందుకు ప్రముఖ ప్రసారకర్తల నుంచి టెండర్లు ఆహ్వానించింది. అయితే ఇ–వేలం ప్రక్రియకు సంబంధించిన పత్రాల్లో అస్పష్టమైన వివరాలే ఉన్నాయని, ఇలాంటి అసంబద్ధ టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేమని భారతీయ బ్రాడ్‌కాస్టర్లు డిస్నీ–స్టార్, వయాకామ్‌–18, సోనీ, జీ నెట్‌వర్క్‌ సంస్థలు ఐసీసీకి లేఖ రాశాయి.

టెండర్ల పత్రాల్లో పొందుపరిచిన అంశాల్లో మరింత స్పష్టత కావాలని లేఖలో కోరింది. ఇంచుమించు నాలుగు బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థలు కూడా ఒకే రకంగా స్పందించాయి. ‘నాలుగు ప్రసారకర్తలు తమ అభ్యంతరాలను తెలుపుతూ ఐసీసీకి లేఖ రాశా యి. అమెజాన్‌ సంస్థ ఇందులో ఎలా ముందుకెళుతుందో అర్థం కావట్లేదు. స్పష్టతలేని అంశాలతో ఆ సంస్థ సంతృప్తిగా ఉందా లేదో తెలియదు.

అలాంటపుడు ఆ సంస్థ ఎందుకంత ఉత్సాహంగా ముందకెళుతుందో మరి! మేం అయితే ఇప్పుడున్న టెండర్ల ప్రక్రియపై అసంతృప్తితో ఉన్నాం. బిడ్లు దాఖలు చేయలేం’ అని ఓ బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థ అధికారి తెలిపారు. ఐసీసీ కమిటీ మీటింగ్‌లలో పాల్గొనే భారత క్రికెట్‌ నియంత్రన మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా బ్రాడ్‌కాస్టర్లకు మరింత సమాచారం ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు తెలిసింది. ఐపీఎల్‌ మీడియా హ క్కుల కోసం బీసీసీఐ నిర్వహించిన ఇ–వేలం ప్రక్రియను అనుసరించేందుకు ఐసీసీ ఆసక్తిచూపడం లేదు.

మరిన్ని వార్తలు