ICC: జింబాబ్వే క్రికెటర్‌ బ్రెండన్‌ టేలర్‌పై ఐసీసీ నిషేధం

28 Jan, 2022 22:30 IST|Sakshi

జింబాబ్వే సీనియర్‌ ఆటగాడు బ్రెండన్‌ టేలర్‌పై ఐసీసీ మూడున్నరేళ్లు నిషేధం విధించింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించడంతో పాటు, డ్రగ్స్ తీసుకుని యాంటీ డోపింగ్ కోడ్ ను కూడా అతిక్రమించినట్లు తేలింది. దీంతో ఐసీసీ అతనిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. టేలర్ అన్ని ఫార్మాట్లలో కలిపి జింబాబ్వే తరఫున 2004 నుంచి 2021 వరకు 284 మ్యాచ్ లు ఆడాడు. మొత్తం 9,938 పరుగులు చేశాడు. వాటిలో 17 సెంచరీలు ఉన్నాయి. అయితే గతేడాదే బ్రెండన్‌ టేలర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

కాగా బ్రెండన్ టేలర్ ఇటీవలే ఓ లేఖలో సంచలన విషయాలు వెల్లడించాడు. గతంలో ఓ భారత వ్యాపారవేత్త క్రికెట్ లీగ్ పై చర్చించేందుకు భారత్ రావాలని కోరాడని, తాను వెళితే డ్రగ్స్ తో పార్టీ ఇచ్చి, తాను డ్రగ్స్ తీసుకున్నప్పటి వీడియోతో బ్లాక్ మెయిల్ చేశారని టేలర్ లేఖలో తెలిపాడు. ఫిక్సింగ్ కు పాల్పడాలంటూ తనకు 15 వేల డాలర్లు కూడా ఇచ్చారని వెల్లడించాడు. అయితే ఈ సమాచారాన్ని తమతో వెంటనే పంచుకోలేదంటూ ఐసీసీ బ్రెండన్ టేలర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా తన తప్పిదాలను టేలర్ అంగీకరించాడని ఐసీసీ పేర్కొంది.

మరిన్ని వార్తలు