289 రోజుల తర్వాత...

27 Nov, 2020 04:29 IST|Sakshi

బరిలోకి భారత క్రికెట్‌ జట్టు

నేడు ఆస్ట్రేలియాతో తొలి వన్డే

శుభారంభంపై ఇరు జట్ల దృష్టి

కరోనా తర్వాత తొలిసారి మైదానంలో ప్రేక్షకులు

ఉదయం గం.9:10 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

భారత క్రికెట్‌ అభిమానుల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. టీమిండియా ఎప్పుడెప్పుడా మైదానంలోకి దిగుతుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ నేటినుంచి మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ను ఆస్వాదించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఐపీఎల్‌ కావాల్సినంత వినోదం పంచినా... జాతీయ జట్టు మ్యాచ్‌లు ఆడేటప్పుడు ఉండే లెక్కే వేరు... కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచం తల్లడిల్లిపోవడంతో ఆగిపోయిన భారత జట్టు ఆట ఇప్పుడు ఆసీస్‌ గడ్డపై మళ్లీ మొదలు కానుంది. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో వన్డే సిరీస్‌ ఆడిన అనంతరం సుమారు తొమ్మిదిన్నర నెలల తర్వాత టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్‌ కోసం మళ్లీ మైదానంలోకి దిగుతోంది. ఆస్ట్రేలియా జట్టును వారి వేదికపైనే వన్డేలో ‘ఢీ’కొడుతోంది. అన్నింటికి మించి కోవిడ్‌–19 తర్వాత తొలిసారి ఈ మ్యాచ్‌తోనే మైదానంలోకి ప్రేక్షకులను అనుమతిస్తుండటం విశేషం.
 
సిడ్నీ: కరోనా వైరస్‌ తెచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి సేన తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నేడు జరిగే తొలి మ్యాచ్‌లో భారత్‌ తలపడనుంది. రాబోయే బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ, వచ్చే రెండేళ్లలో జరిగే రెండు టి20 ప్రపంచ కప్‌ల నేపథ్యంలో వన్డే పోరుకు ప్రాధాన్యత తక్కువగా కనిపిస్తున్నా... రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య జరిగే పోరు అభిమానులకు ఎప్పుడూ ఆసక్తికరమే. కొత్తగా మొదలైన ఐసీసీ వన్డే సూపర్‌ లీగ్‌లో ఈ సిరీస్‌ కూడా భాగం. సిడ్నీ మైదానంలో ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టేడియంలోకి 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. మరోవైపు 1992 ప్రపంచకప్‌లో భారత క్రికెట్‌ జట్టు ధరించిన జెర్సీని పోలిన (రెట్రో) డ్రెస్‌లతోనే బరిలోకి దిగుతుండటం ఆకర్షణీయాంశం.  

మయాంక్‌కు అవకాశం
భారత జట్టు ఆడిన ఆఖరి వన్డే తుది జట్టును చూస్తే రెండు మార్పులు ఖాయమయ్యాయి. వన్డేల్లో చోటు కోల్పోయిన పృథ్వీ షా స్థానంలో సీనియర్‌ శిఖర్‌ ధావన్‌ ఓపెనర్‌గా రానున్నాడు. అతనికి జోడీగా మయాంక్‌ అగర్వాల్‌ బరిలోకి దిగుతాడు. మరో ఓపెనర్‌గా శుబ్‌మన్‌ గిల్‌ అందుబాటులో ఉన్నా... మయాంక్‌ దూకుడైన శైలి అతనికి అవకాశం కల్పించవచ్చు. తర్వాతి స్థానాల్లో కోహ్లి, అయ్యర్‌లు భారత బ్యాటింగ్‌ భారాన్ని మోయాల్సి ఉండగా... ఐదో స్థానంలో రాహుల్‌ ఖాయం. కాబట్టి వికెట్‌ కీపర్‌గా కూడా అతనే బాధ్యతలు నిర్వర్తిస్తాడు.

ఆరో స్థానంలో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండే బదులుగా హార్దిక్‌ పాండ్యా ఆడే అవకాశం ఉంది. అయితే ఐపీఎల్‌లో ఒక్క బంతి కూడా బౌలింగ్‌ చేయని పాండ్యాను ఆల్‌రౌండర్‌గా ఆడించాలా లేక పాండేను కొనసాగించాలా అనే విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు ఇంకా స్పష్టత రాలేదు. పైగా 2019 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత హార్దిక్‌ ఇప్పటి వరకు మరో వన్డే మ్యాచ్‌ ఆడలేదు. పేసర్లుగా బుమ్రా, షమీ ఖాయం కాగా... మూడో పేసర్‌ స్థానం కోసం శార్దుల్, సైనీ మధ్య పోటీ ఉంది. భారత జట్టు తాము ఆడిన చివరి వన్డే సిరీస్‌లో (న్యూజిలాండ్‌ చేతిలో) 0–3తో ఓటమి పాలైంది. ఐపీఎల్‌లో ఆడినా... చాలా రోజుల తర్వాత ఆడుతున్న వన్డే ఫార్మాట్‌కు అనుగుణంగా మారి మన ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన ఇస్తారనేది ఆసక్తికరం.  

స్మిత్‌ పునరాగమనం
సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఎప్పుడైనా బలమైన జట్టే. ఇప్పుడు మళ్లీ కంగారూలు సమష్టిగా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఐపీఎల్‌ కంటే ముందు ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపై ఆస్ట్రేలియా 2–1తో ఓడించి వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. టెస్టుల్లో ‘కన్‌కషన్‌’కు గురైన స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఆ మూడు వన్డేల్లోనూ ఆడలేదు. అతను ఇప్పుడు మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైనా జాతీయ జట్టు తరఫున మ్యాక్స్‌వెల్‌ ఆటను తక్కువగా అంచనా వేయలేం.

ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కూడా అతను రెండు అద్భుత ఇన్నింగ్స్‌లు (59 బంతుల్లో 77 – 90 బంతుల్లో 108) ఆడాడు. కాబట్టి ఏడో స్థానంలో వచ్చే మ్యాక్స్‌వెల్‌ వరకు ఆసీస్‌ బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. వార్నర్, కొత్త కెరటం లబ్‌షేన్‌లతో పాటు ఐపీఎల్‌లో అదరగొట్టిన స్టొయినిస్‌ జట్టు బలం. పేస్‌ త్రయం స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్‌లను ఎదుర్కోవడం భారత జట్టుకు అంత సులువు కాదు. అయితే గత పర్యటనలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు వన్డేల్లోనూ భారత్‌ నెగ్గడం విశేషం.  

‘ముగిసిన సాఫ్ట్‌ క్వారంటైన్‌’
సిడ్నీలో భారత క్రికెటర్లకు కాస్త ఊరట లభించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్‌ ముగియడంతో గురువారం జట్టు సభ్యులంతా మరో హోటల్‌లోకి మారారు. ‘సాఫ్ట్‌ క్వారంటైన్‌’ నిబంధనల ప్రకారం ఆటగాళ్లంతా మైదానంలో కలిసి ప్రాక్టీస్‌ చేయడం మినహా హోటల్‌లో కూడా మరొకరిని కలవరాదు. ఎవరి గదుల్లో వారు ఒంటరి పక్షుల్లా ఉండాల్సిందే. ఇప్పుడు వీరికి కొన్ని సడలింపులు లభిస్తాయి. కొత్త హోటల్‌లో కూడా బయో సెక్యూర్‌ బబుల్‌లోనే ఉన్నా సహచర క్రికెటర్లతో కలిసి మాట్లాడుకునేందుకు, కలిసి భోజనం చేసేందుకు అవకాశం ఉంది.  

తుది జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, మయాంక్, అయ్యర్, రాహుల్, హార్దిక్, జడేజా, షమీ, బుమ్రా, శార్దుల్‌/సైనీ, చహల్‌.
ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్, స్మిత్, లబ్‌షేన్, స్టొయినిస్, క్యారీ, మ్యాక్స్‌వెల్, కమిన్స్, స్టార్క్, జంపా, హాజల్‌వుడ్‌.

పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. గత 7 వన్డేల్లో 6 సార్లు ముందుగా బ్యాటింగ్‌ చేసిన జట్టు గెలిచింది. వాతావరణం బాగుంది. వర్ష సూచన లేదు. సిడ్నీ మైదానంలో భారత జట్టు ఆస్ట్రేలియాపై 2 మ్యాచ్‌లు గెలిచి 14 ఓడింది. ఇక్కడ ఆడిన 5 మ్యాచ్‌లలో కలిపి కోహ్లి మొత్తం 36 పరుగులే చేశాడు. ఇటీవల మరణించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌కు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు నిమిషం పాటు మౌనం పాటించడంతో పాటు భుజాలకు నలుపు రంగు బ్యాండ్‌లు ధరించి బరిలోకి దిగుతారు.

యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని మేం భావిస్తున్నాం. ఆస్ట్రేలియాలాంటి చోట ఆడాలని వారెంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తమ సత్తా చాటేందుకు, స్థాయిని పెంచుకునేందుకు వారికి ఇది సరైన వేదిక. బుమ్రా, షమీలకు తగినంత విశ్రాంతి ఇవ్వాలనేది టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచన. వారి స్థానాల్లో కుర్రాళ్లు ఆడతారు. ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తుంది. కాబట్టి సిరీస్‌ హోరాహోరీగా సాగడం ఖాయం. అయితే వారిని ఓడించేందుకు మాకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రేరణా అవసరం లేదు. మేం అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. టూర్‌లో శుభారంభం చేస్తే మంచిదే కానీ అదే సర్వస్వం కాదు. ప్రతీ మ్యాచ్‌ మాకు కీలకమే.
–విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌  
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా