ఐపీఎల్‌ 2020: బీసీసీఐకి మరో సవాల్‌

4 Sep, 2020 09:23 IST|Sakshi

ఎలైట్‌ అంపైర్లకు కరోనా భయం

ఐపీఎల్‌కు పలువురు దూరం! 

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) తాజా సీజన్‌ నిర్వహణ కోసం కిందా మీదా పడుతోన్న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి తాజాగా అంపైర్ల విషయంలో మరో సవాల్‌ ఎదురైంది. యూఏఈ వేదికగా ఈ నెల 19 నుంచి ఆరంభమయ్యే ఐపీఎల్‌ 13వ సీజన్‌లో విధులు నిర్వర్తించేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఎలైట్‌ ప్యానెల్‌కు చెందిన అంపైర్లు సుముఖంగా లేకపోవడమే అందుకు కారణం.

ఐపీఎల్‌లో అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాల్సిందిగా ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌ సభ్యులను బీసీసీఐ కోరగా... నలుగురు మాత్రమే అందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారని సమాచారం. ఇందులో క్రిస్‌ గఫాని (న్యూజిలాండ్‌), రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ (ఇంగ్లండ్‌), మైకేల్‌ గాఫ్‌ (ఇంగ్లండ్‌)తో పాటు భారత్‌కు చెందిన నితిన్‌ మీనన్‌ ఉన్నారు.  వ్యక్తిగత కారణాలతోనే ఈ ఏడాది ఐపీఎల్‌కు తాము దూరమవుతున్నామని అంపైర్లు చెబుతున్నా... వాస్తవం మాత్రం కరోనానే అని తెలుస్తోంది. ఐపీఎల్‌ ఆరంభం నుంచి లీగ్‌లో భాగంగా ఉంటున్న కుమార ధర్మసేన కూడా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. శ్రీలంకలో జరిగే క్రికెట్‌ టోర్నీలతో తాను బిజీగా ఉండటమే దీనికి కారణమని అతడు బీసీసీఐకి చెప్పడం విశేషం.
(చదవండి: అభిమానుల‌కు డేవిడ్ వార్న‌ర్‌ స‌వాల్)

ప్రతి సీజన్‌లో ఎలైట్‌ ప్యానల్‌కు చెందిన ఆరుగురు అంపైర్లను ఐపీఎల్‌ కోసం బీసీసీఐ తీసుకుంటూ వస్తోంది. కరోనాతో  ఈసారి ఐపీఎల్‌ సెప్టెంబర్‌కు వాయిదా పడటం... అదే సమయంలో అంతర్జాతీయ సిరీస్‌లు లేకపోవడంతో ఎక్కువ మంది ఎలైట్‌ ప్యానెల్‌ అంపైర్లను తీసుకోవాలని బీసీసీఐ యోచించింది. క్వారంటైన్, బయో సెక్యూర్‌ బబుల్‌ దాటి వెళ్లకూడదు వంటి నిబంధనల నడుమ దాదాపు రెండు నెలల పాటు సాగే ఐపీఎల్‌లో బాధ్యతలు నిర్వర్తించడం అవసరమా అనే అభిప్రాయానికి వారు వచ్చినట్లు సమాచారం. దాంతో వారి స్థానంలో భారత అంపైర్లను తీసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్‌ కోసం కనీసం 15 మంది అంపైర్లు అవసరం. అందులో 12 మంది ఫీల్డ్, టీవీ అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తే... మరో ముగ్గురు  ఫోర్త్‌ అంపైర్లుగా ఉంటారు.  
(చదవండి: వైజ్‌ కెప్టెన్‌ ఉన్నాడు.. వైస్‌ కెప్టెన్‌ ఎందుకు?)

మరిన్ని వార్తలు