ICC: సైబర్‌ క్రైమ్‌ వలలో ఐసీసీ.. 20 కోట్ల నష్టం

21 Jan, 2023 11:10 IST|Sakshi

క్రికెట్‌లో పెద్దన్న పాత్ర పోషించే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) సైబర్‌ క్రైమ్‌ చిక్కుకున్నట్లు సమాచారం. గత ఏడాది ఆన్‌లైన్‌ మోసం కారణంగా ఐసీసీ 2.5 అమెరికన్‌ మిలియన్‌ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 20 కోట్లు) నష్టపోయినట్లు ఒక వెబ్‌సైట్ కథనం ప్రచురించింది. అమెరికా స్థావరంగా ఫిషింగ్‌ మెయిల్‌ స్కామ్‌ జరిగినట్టు సమాచారం. ఈ విషయంపై ఐసీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

సమాచారం ప్రకారం ఐసీసీ ఫిర్యాదు మేరకు ఎఫ్‌బీఐ(FBI) పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐసీసీ అకౌంట్‌ నుంచి నేరగాళ్లకు డబ్బు ఎలా చేరిందనేది కచ్చితంగా తెలియరాలేదు. బిజనెస్‌ మెయిల్‌ తరహాలో సందేశాన్ని పంపి.. సైబర్‌ ఫ్రాడ్‌కు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఐసీసీకి చెందిన కన్సల్టెంట్‌ అంటూ సంస్థకు కుచ్చుటోపీ వేసినట్లు తెలుస్తోంది. సదరు కన్సల్టెంట్ ఈమెయిల్ ఐడీని పోలిన ఐడీతో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌కు మెయిల్ చేశారట.

ఆ మెయిల్‌లో 5 లక్షల డాలర్ల విలువైన వోచర్‌ను క్లియర్ చేయాలని కోరారు. ఏ ఖాతాకు ఆ సొమ్మును పంపాలో ఆ అకౌంట్ వివరాలు కూడా పంపించారు. దీంతో ఐసీసీ ఫైనాన్స్ విభాగం ఆ వోచర్‌ను క్లియర్ చేసింది. ఆ తర్వాత మరో రెండు, మూడు సార్లు ఇలాంటి టెక్నిక్‌తోనే సైబర్‌ నేరగాళ్లు డబ్బును కాజేసినట్లు తెలుస్తోంది. ఈ తరహా మోసాలను బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ (బీఈసీ) ఫిషింగ్ అంటారు.

చదవండి: 'మంచి భవిష్యత్తు'.. చహల్‌ను టీజ్‌ చేసిన రోహిత్‌ శర్మ

Usain Bolt: బోల్ట్‌కు చేదు అనుభవం.. అకౌంట్‌ నుంచి 97 కోట్లు మాయం

మరిన్ని వార్తలు