టి20ల్లో స్లో ఓవర్‌రేట్‌పై ఐసీసీ కొత్త నిబంధన

8 Jan, 2022 07:40 IST|Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ టి20ల్లో ఓవర్‌రేట్‌ ఇటీవల చాలా సమస్యగా మారిపోయింది. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, జరిమానాలు విధించినా జట్లు ఓవర్లు పూర్తి చేసేందుకు నిర్ణీత షెడ్యూల్‌కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. ముఖ్యంగా మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతున్న సమయంలో వ్యూహ ప్రతివ్యూహల కోసం సుదీర్ఘంగా చర్చిస్తుండటంతో ఇది మారడం లేదు. దీనికి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చెక్‌ పెట్టేందుకు సిద్ధమైంది.

జరిమానాలకంటే ఆ తప్పునకు మైదానంలోనే శిక్ష విధించాలని నిర్ణయించింది. కొత్త నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంకంటే ఓవర్లు ఆలస్యం చేస్తే చివరి ఓవర్లో 30 గజాల సర్కిల్‌ వెలుపల ఒక ఫీల్డర్‌ను తగ్గిస్తారు. ఇప్పటి వరకు ఐదు మందికి అవకాశం ఉండగా నలుగురినే అనుమతిస్తారు. కీలక సమయంలో బౌండరీ వద్ద ఒక ఫీల్డర్‌ తగ్గడం స్కోరింగ్‌పై ప్రభావం చూపిస్తుంది కాబట్టి జట్లు ఇకపై జాగ్రత్తలు తీసుకుంటాయని ఐసీసీ భావిస్తోంది.

సాధారణంగా ఒక టి20 మ్యాచ్‌లో 85 నిమిషాల్లో 20 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ‘85వ నిమిషంలో 20వ ఓవర్‌ మొదలు కావాలి’ అనేది తాజా నిబంధన. అలా చేస్తేనే సరైన ఓవర్‌రేట్‌ నమోదు చేసినట్లుగా భావిస్తారు. లేదంటే ఫీల్డర్‌ కోత పడుతుంది. అయితే చివరి ఓవర్‌ను 85వ నిమిషంలోనే ప్రారంభిస్తే ఆ ఓవర్‌ కాస్త ఆలస్యంగా సాగినా చర్యలు ఉండవు. మూడో అంపైర్‌ ఈ టైమింగ్‌ను పర్యవేక్షిస్తారు. అనివార్య కారణాల వల్ల ఆలస్యం జరిగితే మాత్రం దానికి అనుగుణంగా సమయాన్ని సరి చేస్తారు. టి20 ఇన్నింగ్స్‌ మధ్యలో (10 ఓవర్ల తర్వాత) రెండున్నర నిమిషాల డ్రింక్స్‌ బ్రేక్‌ తీసుకోవచ్చనేది మరో కొత్త నిబంధన. ఈ నెల 16న వెస్టిండీస్, ఐర్లాండ్‌ మధ్య జరిగే మ్యాచ్‌ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

చదవండి: SA vs IND: కోహ్లి గాయంపై కీలక ప్రకటన చేసిన ద్రవిడ్‌..

మరిన్ని వార్తలు