ICC media rights: రూ. 24 వేల కోట్లకు...

28 Aug, 2022 06:07 IST|Sakshi

భారత్‌లో ఐసీసీ మ్యాచ్‌ల హక్కులు డిస్నీ–స్టార్‌ సొంతం  

దుబాయ్‌: భారత్‌లో జరిగే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అన్ని మ్యాచ్‌ల హక్కులను డిస్నీ స్టార్‌ సంస్థ సొంతం చేసుకుంది. శుక్రవారం వేలం నిర్వహించగా... దీనిని ఐసీసీ శనివారం అధికారికంగా ప్రకటించింది. నాలుగేళ్ల కాలానికి (2024–2027) ఈ హక్కులు వర్తిస్తాయి. టీవీ, డిజిటల్‌ హక్కులు రెండింటినీ సొంతం చేసుకున్న డిస్నీ... ఇందు కోసం సుమారు 3 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 24 వేల కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం. ఈ మొత్తంపై ఐసీసీ ప్రకటనలో వెల్లడించకపోయినా... గత హక్కులతో పోలిస్తే భారీ పెరుగుదల వచ్చినట్లు మాత్రం పేర్కొంది.

హక్కుల కోసం డిస్నీతో పాటు సోనీ, వయాకామ్, జీ సంస్థలు కూడా పోటీ పడినా... వారెవరూ కూడా రూ. 20 వేల కోట్లకు మించి ఇచ్చేందుకు సిద్ధపడలేదని తెలిసింది. ఐసీసీ ఇచ్చిన హక్కుల్లో
పురుషుల, మహిళల వన్డే, టి20 వరల్డ్‌కప్‌లు, చాంపియన్స్‌ ట్రోఫీతో పాటు అండర్‌–19 ప్రపంచకప్‌ కూడా ఉంటాయి. డిస్నీ స్టార్‌ వద్ద ఇప్పటికే ఐపీఎల్, బీసీసీఐ, దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు మ్యాచ్‌లతో పాటు ఆస్ట్రేలియా బోర్డు డిజిటల్‌ హక్కులు కూడా ఉన్నాయి. అమెరికా, ఇంగ్లండ్‌లలో హక్కుల కోసం క్రిస్మస్‌కు ముందు ఐసీసీ మరోసారి వేలం నిర్వహించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు