ICC T20I Cricketer: వారెవ్వా.. ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా టీమిండియా స్టార్‌

25 Jan, 2023 16:08 IST|Sakshi

ICC Men's T20I Cricketer of the Year 2022: ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022గా టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఎంపికయ్యాడు. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ మిస్టర్‌  ప్లేయర్‌ను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి బుధవారం వెల్లడించింది. 

కాగా 2022లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్య.. 31 మ్యాచ్‌లు ఆడి 187.43 స్ట్రైక్‌రేటుతో 1164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి. గతేడాది పలు కీలక మ్యాచ్‌లలో టీమిండియాను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన ఈ ముంబై బ్యాటర్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1గా ఎదిగాడు.

ఈ క్రమంలో అనేక రికార్డులు సృష్టించాడు. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యి కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. మొత్తంగా 68 సిక్సర్లు బాది.. పొట్టిఫార్మాట్లో ఏడాది కాలంలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా సూర్య నిలిచాడు. 

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌-2022 టోర్నీలో సూర్య అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌లో ఆరు ఇన్నింగ్స్‌లో మూడు హాఫ్‌ సెంచరీలు చేశాడు. 189కి పైగా స్ట్రైక్‌రేటుతో దుమ్మురేపాడు.

ఆ సెంచరీ ప్రత్యేకం
ఇక ఆ తర్వాత న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా రెండో సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో 890 రేటింగ్‌ పాయింట్లతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

కాగా ఇంగ్లండ్‌తో నాటింగ్‌హాం మ్యాచ్‌లో భాగంగా సూర్య తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ శతకం బాదిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 55 బంతుల్లోనే 117 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు సూర్య.

చదవండి: ICC ODI Rankings: నంబర్‌ వన్‌ బౌలర్‌గా సిరాజ్‌

మరిన్ని వార్తలు