World Cup Super League: నెదర్లాండ్స్‌ పర్యటనకు పాకిస్తాన్‌.. షెడ్యూల్‌ ఇదే!

21 Apr, 2022 10:45 IST|Sakshi

ICC Cricket World Cup Super League: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ఈ ఏడాది ఆగష్టులో నెదర్లాండ్స్‌లో పర్యటించనుంది. ఐసీసీ పురుషుల క్రికెట్‌ ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా మూడు వన్డేలు ఆడనుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు డైరెక్టర్‌ జకీర్‌ ఖాన్‌ ధ్రువీకరించారు. నిజానికి మూడు వన్డేల సిరీస్‌ నిమిత్తం 2020 జూలైలో పాకిస్తాన్‌ నెదర్లాండ్స్‌ టూర్‌కు వెళ్లాల్సింది. 

అయితే, కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ పర్యటనను వాయిదా వేశారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరుణంలో ఈ మ్యాచ్‌లను రీషెడ్యూల్‌ చేశారు. ఈ ఏడాది ఆగష్టులో 16,18,21 తేదీల్లో రోట్టర్‌డామ్‌లోని వీఓసీ వేదికగా సిరీస్‌ను నిర్వహించనున్నారు. 

ఈ విషయం గురించి జకీర్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ‘‘నెదర్లాండ్స్‌ క్రికెట్‌ బోర్డుకు మద్దతుగా నిలబడతాం. 2023 వరల్డ్‌కప్‌ నేపథ్యంలో ఇరు జట్లు ఈ సిరీస్‌ ఆడనున్నాయి. నెదర్లాండ్స్‌లో క్రికెట్‌ అభివృద్ధి కోసం మేము మా వంతు సాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందే ఉంటాం’’ అని పేర్కొన్నాడు. కాగా గతంలో పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌ మూడు సందర్భాల్లో(1996, 2003 ప్రపంచకప్‌, 2002 చాంపియన్స్‌ ట్రోఫీ) తలపడ్డాయి.

ఈ మూడు వన్డేల్లోనూ పాకిస్తాన్‌ విజయం సాధించింది. ఇక ఐసీసీ పురుషుల క్రికెట్‌ ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్‌ ఆరింట గెలిచి.. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. నెదర్లాండ్స్‌ 10 ఓటములతో అట్టడుగున ఉంది. కాగా పాక్‌ జట్టు నెదర్లాండ్స్‌ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.

చదవండి: IPL 2022: కుల్దీప్‌ క్రీడా స్ఫూర్తి.. ఈ అవార్డు అతడితో పంచుకుంటా.. క్రెడిట్‌ అంతా రిషభ్‌దే!

మరిన్ని వార్తలు