ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌: భారత ఆటగాళ్లకు దక్కని చోటు

5 May, 2021 21:46 IST|Sakshi

దుబాయ్‌: ఏప్రిల్‌ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్‌ అవార్డుకు నామినేట్ అయిన పురుషులు, మహిళా క్రికెటర్ల జాబితాను ఐసీసీ బుధవారం ప్రకటించింది. పురుషుల జాబితాలో పాకిస్థాన్‌ బ్యాట్స్‌మెన్లు బాబర్‌ అజామ్‌, ఫఖర్‌ జమాన్‌, శ్రీలంక ఆటగాడు కుశాల్ భుర్టెల్ చోటు దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో అద్బుత ప్రదర్శన చేసిన బాబర్‌ అజమ్‌, ఫఖర్ జమాన్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యారు.

బాబార్‌ అజమ్‌ దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఒక సెంచరీ, అర్థ సెంచరీతో ఆకట్టుకోగా.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, జింబాబ్వేలతో జరిగిన టీ20 సిరీస్‌లలో 7 మ్యాచ్‌ల్లోనే 126.55 స్ట్రైక్‌ రేట్‌తో 305 పరుగులు సాధించిన బాబర్‌.. రెండు అర్థశతకాలు.. ఒక సెంచరీ( 59 బంతుల్లో 122 పరుగులు) దుమ్మురేపాడు. కాగా ఇటీవలే ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బాబర్‌ అజమ్‌ విరాట్‌ కోహ్లిని వెనక్కినెట్టి నెంబర్‌వన్‌ స్థానాన్ని ఆక్రమించాడు. మరోవైపు ఫఖర్‌ జమాన్‌ సైతం ప్రొటీస్‌తో జరిగిన రెండో వన్డేలో 193 పరుగులు మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు ఆఖరి వన్డేలోనూ సెంచరీతో మెరిశాడు. మొత్తంగా 111.3 స్ట్రైక్‌రేట్‌తో 302 పరుగులు సాధించాడు.ఇక నేపాల్‌ క్రికెటర్‌ కుషాల్‌ భుర్టెల్‌ ఇటీవలే జరిగిన మలేషియా, నెదర్లాండ్స్‌, నేపాల్‌ మధ్య జరిగిన టీ20 ట్రై సిరీస్‌లో అద్భుత ప్రదర్శన నమోదు చేశాడు. నాలుగు వరుస అర్థసెంచరీల సహాయంతో మొత్తంగా 278 పరుగులతో రాణించిన కుషాల్‌ నేపాల్‌ ట్రై సిరీస్‌ను నెగ్గడంలో కీలకపాత్ర వహించి ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌కు నామినేట్‌ అయ్యాడు.

కాగా ఐసీసీ ఈ అవార్డులు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ ఒక్క భారత ఆటగాడికీ చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి. ఇక మహిళల విభాగంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌వుమెన్లు అలీస్సా హీలీ, మెగన్‌ స్కట్‌, న్యూజిలాండ్‌ క్రీడాకారిణి కాస్పెర్క్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. కాగా జనవరిలో ఐసీసీ ఈ అవార్డులను ప్రవేశపెట్టగా పురుషుల జాబితాలో తొలిసారి రిషబ్‌ పంత్‌(జనవరి), రవిచంద్రన్‌ అశ్విన్‌(ఫిబ్రవరి), భువనేశ్వర్‌ కుమార్‌(మార్చి) వరుసగా టీమిండియా ఆటగాళ్లే గెలుచు​కోవడం విశేషం.
చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్‌: దుమ్మురేపిన పంత్‌.. దిగజారిన బాబర్‌ అజమ్‌

మరిన్ని వార్తలు