ICC Player Of Month: ఐపీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌.. రేసులో గిల్‌, సిరాజ్‌

7 Feb, 2023 18:19 IST|Sakshi

జనవరి నెలకు గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు పోటీ పడుతున్న క్రికెటర్ల జాబితాను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. పురుషుల విభాగంలో ఈ అవార్డుకు టీమిండియా నుంచి ఇద్దరు క్రికెటర్లు రేసులో ఉన్నారు. ఆ ఇద్దరే శుబ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌. వీరిద్దరితో పాటు న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ డెవన్‌ కాన్వే కూడా పోటీ పడుతున్నాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

టీమిండియాకు లభించిన ఆణిముత్యం శుబ్‌మన్‌ గిల్‌. కొన్నాళ్లుగా టెస్టులు మాత్రమే ఆడిన గిల్‌ తాజాగా వన్డేలు,టి20ల్లో తన హవా కొనసాగిస్తున్నాడు. మొదట శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో అతడు 70, 21, 116 రన్స్ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ తో హైదరాబాద్ లో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీ బాది తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. కేవలం 149 బాల్స్ లోనే 208 రన్స్ చేయడం విశేషం. అదే సిరీస్ లో తర్వాతి రెండు వన్డేల్లో 40, 112 స్కోర్లు చేశాడు.ఇక న్యూజిలాండ్ తో టి20 సిరీస్‌లోనూ రెచ్చిపోయాడు. టి20 ఫార్మాట్ కు పనికి రాడన్న విమర్శలకు చెక్ పెడుతూ చివరి మ్యాచ్ లో మెరుపు సెంచరీ సాధించాడు.

మరోవైపు హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ టీమిండియాలో క్రమంగా ప్రధాన బౌలర్‌గా ఎదుగుతున్నాడు. బుమ్రా లేని లోటును తీరుస్తున్నాడు. వన్డేల్లో ఇప్పటికే నంబర్ వన్ ర్యాంకు కూడా అందుకున్నాడు.శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ లో అతడు మొత్తం 9 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత తన హోమ్ గ్రౌండ్ హైదరాబాద్ లో న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్లు తీసుకున్నాడు. రెండో వన్డేలో ఆరు ఓవర్లు వేసి కేవలం 10 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

ఇక కొత్త ఏడాదిని డెవన్‌ కాన్వే అద్భుతంగా ఆరంభించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి జనవరిలో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు బాదిన కాన్వే తన సూపర్‌ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు