ICC Rankings: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ సాధించిన ఇంగ్లీష్‌ ప్లేయర్‌

7 Jul, 2021 16:33 IST|Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ క్రిస్‌ వోక్స్‌.. కెరీర్‌ అత్యుత్తమ వన్డే ర్యాంకింగ్‌ సాధించాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో 6 వికెట్లు పడగొట్టిన వోక్స్‌(711 పాయింట్లు).. ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌(737 పాయింట్లు) నంబర్‌వన్‌గా కొనసాగుతుండగా, బంగ్లా బౌలర్‌ మెహదీ హసన్‌ (713) రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా (690 పాయింట్లు) ఒక స్థానాన్ని కోల్పోయి ఆరో ప్లేస్‌కు దిగజారాడు. 

ఇక బ్యాటింగ్‌ విషయానికొస్తే.. శ్రీలంకతో సిరీస్‌లో 147 పరుగులతో అదరగొట్టిన ఇంగ్లండ్‌ టెస్ట్‌ కెప్టెన్‌ జో రూట్‌.. రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ స్థానంలో, వన్డే కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఒక స్థానం ఎగబాకి 25వ ప్లేస్‌లో నిలిచారు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వరుసగా రెండు, మూడు స్థానాలను నిలబెట్టుకోగా, పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 

ఇక టీ20 ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. బ్యాటింగ్‌ విభాగంలో విండీస్‌ ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ ఒక స్థానం మెరుగుపర్చుకుని 9వ ప్లేస్‌కు చేరుకోగా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్‌ డికాక్‌, ఎయిడెన్‌ మర్‌క్రమ్‌లు.. 13, 19వ స్థానాలకు ఎగబాకారు. విండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో ఈ ఇద్దరు ఓపెనర్లు అదరగొట్టారు. దీంతో ప్రొటీస్‌.. ఆతిధ్య జట్టుపై 3-2తో గెలుపొందింది. ఈ జాబితాలో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌ సైతం ఒక స్థానం మెరుగుపరుచుకని 6వ ప్లేస్‌కు చేరుకోగా, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 5వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌ ప్లేయర్‌ డేవిడ్‌ మలాన్, ఆసీస్‌ ఆరోన్‌ ఫించ్‌, పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌లు వరుసగా 1, 2, 3 స్థానాలను నిలబెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు